మతలబ్

వచన కవితా సంపుటి.
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము ఆర్థిక సహకారంతో ముద్రితం పుస్తకంలోని అభిప్రాయాలు రచయిత సొంతం. వాటితో విశ్వవిద్యాలయానికి ఎలాంటి బాధ్యత లేదు.
అంకితం
అమ్మ 17 జూన్ 1993న చనిపోయారు.
జ్ఞాపకంగా అమ్మపై రాసిన దీర్ఘ గేయం సరిదిద్ది అచ్చుకు ఇవ్వలసి ఉంది.
ఆ ఆలస్యం కలిగించే అపరాధ భావాన్ని కొంచమైనా తగ్గించుకోవ డానికి ముందస్తుగా ఈ పుస్తకం కన్నీటితో అమ్మకు….
అవీ ఇవీ
1980 జూన్లో ‘స్పందన’ మొదటి కవితా సంపుటి, 1987 జూన్లో ‘పదును’ రెండవ కవితా సంపుటి ప్రచురించాక 2013 అక్టోబర్ లో ‘హైద్రాబాదు సిర్ఫ్ హమారా’ ప్రచురించినప్పటికీ అది దీర్ఘ కవిత కాబట్టి 32 సంవత్సరాల తర్వాత మళ్లీ కవితా సంపుటి తెస్తున్నాను.
ఉద్యోగం వల్లనే అనుకోండి, మరోటి అనుకోండి కారణం ఏదైనా 1989 నుండి కవితలు రాయడం తగ్గింది. రాసినవి కూడా చాలా వరకు పోగొటుకోవడం, కొన్ని సగం వరకు రాసి పూర్తి చేయలేకపోవడం జరిగింది.
అందువల్ల మొత్తం 42 కవితలతో వస్తున్న ఈ సంపుటిలో 27 కవితలు ఉద్యోగ విరమణ (2017 ఆగస్టు) తర్వాత రాసినవే. 1987 నుండి అప్పుడప్పుడు రాసిన కవితలకు ఇటీవల రాసిన కవితలకు శైలీ, శిల్పం లాంటి వాటిలో ఏకరూపత ఉండకపోవచ్చును.
అయినా అవి కూడా మీకు అందించాలనే ఉద్దేశంతో అన్నీ కలిపి ఒక దగ్గర చేర్చి పుస్తకంగా అందిస్తున్నాను.
ఈ పుస్తకం ప్రచురించడానికి పాక్షిక ఆర్థిక సహాయం అందించిన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారికి, ప్రోత్సహించిన సోదరి భండారు విజయ, అన్నయ్య డాక్టర్ శ్రీరంగస్వామి, ఆత్మీయులు డాక్టర్ పల్లేరు వీరస్వామి, బూర భిక్షపతి, జుగాష్ విలి, నా సహచరి శైలజ గారలకు,..
అడగగానే ముఖచిత్రం అందించిన కూరెళ్ల శ్రీనివాస్ గారికి, సహకరించిన పెద్దలు కూరెళ్ల వీఠలాచార్య గారికి, డీటీపీ చేసిన సోదరి కరుణకు, బ్యాక్ కవర్ డిజైన్ చేసిన ధరణి ఎంటర్ ప్రైజెస్ వారికి, పుస్తకం ముద్రించిన నవ్య ప్రింటర్స్ వారికి కృతజ్ఞతలు.
బలిదానం
సెప్టెంబర్, 1987
సెప్టెంబర్ 4, 1987లో రాజస్తాన్లోని దేవరల గ్రామంలో 18 ఏళ్ల రూప్ కన్వార్‌ను బలవంతంగా సతీసహగమనం కావించిన సంఘటనపై
నా తల్లిలో నాకిప్పుడు
రూప్ కన్వార్ రూపమే కనిపిస్తుంది
ఏ ఇల్లాలు మాంగళ్యం చూసినా నాకు
రూప కన్వార్ సతే గుర్తుకొస్తుంది
ఈ గాల్లో వస్తున్న వాసన
రూప కన్వార్ చితి మంటలది కాదు కదా
ఈ గాల్లో వస్తున్న ధ్వని
ఆమె చావు కేకలు కావు కదా
చున్నీ ఉత్సవాల్లో ఓట్ల కవ్వింపు
ప్రచారం చేసుకొనే రాజకీయ పార్టీలున్న
నా దేశంలో
చితి మీద రూప్ కన్వార్ కట్టుకున్న
చీర రంగు ధర చర్చించే
మహిళా మణులు ఉన్న
నా దేశంలో
రూప్ కన్వార్ గురించి నేనెంత అరిచినా
ఆక్రందనగానే మిగిలిపోతుందా
రూప కన్వార్ సతీ నాలుగు రోజులు
పత్రికల పతాక శీర్షికగా మిగిలిపోనుందా
నిజంగా రూప కన్వారు కాల్చింది
దేవరల రాజపుత్రులేనా - పచ్చి అబద్ధం
స్త్రీని పురుషుని ఆస్తిగా మార్చే భారత వైవాహిక వ్యవస్థ
స్త్రీ పై పురుషునికి ప్రశ్నించలేని అధికారం కట్టబెట్టే మనువాదం
మొత్తంగా ప్రపంచంలో
ఏ మాత్రం పట్టు సడలని పితృస్వామ్యం
పొలాల్లో కార్బొనాల్లో కార్యాలయాల్లో పుస్తకాల్లో
ఇళ్లలో వంటగదుల్లో
కర్తవ్య నిష్ఠాగరిష్టులై కర్మయోగుల్లా
తలవంచి పని చేసుకుంటూపోయే
చెల్లెల్లారా! అక్కల్లారా! అమ్మల్లారా!
రూప కన్వార్ సతీని ఒక్కసారి
గుండెలకు నిండుగా హత్తుకోండి
ఉవ్వెత్తున లేచిన మంటల్లో
రూప్ కన్వార్ వేసిన కేకలు
గుమిగూడిన జనం జేజేలు ఛేదించలేక
దేవరలో ఏ చెట్లను ఆశ్రయించాయో
చితి చుట్టూ చేరి జేజేలు పలికే జనాన్ని
లీలగా కాంచిన రూప్ కన్వార్
ఈ దేశం గురించి స్త్రీ
జాతి గురించి
ఏమనుకుందో
తను కాలిపోతూ కాలిపోతూ
ఏ భవిష్యత్తు ఊహించిందో
రెప్పలు మాడుతున్న క్షణంలో
ఆ కళ్ళు ఏ భావాన్ని ప్రస్ఫుటం చేశాయో
కట్టిన కట్లను కాలుతున్న ఒళ్లును
చుట్టూ పేర్చిన కట్టెలను చూసి
ఆమె ఏ స్పందనకు లోనైందో
ఊపిరి విడుస్తూ విడుస్తూ
స్త్రీ లోకానికి ఏమి చెప్పాలనుకుందో
మీకు ప్రత్యక్షం కాకపోవు
అవి మీ గుండెల్లో రేపే ప్రతిస్పందనను
మీ గొంతులో ప్రతిధ్వనింప చేయండి
ఈ దేశపు వీధుల్లో పాటగా కవాతు చేయించండి
ఉడుకేయడం పడకేయడం కనేయడం
జీవితమంతా ఎవరి కోసమో బతుకేయడం
బ్రతుకు అనుకొనే మట్టి బొమ్మలకు
మీ పాటలు ప్రాణం పోస్తే
వాళ్ళ హక్కుల కోసం వాళ్లను వీధుల్లోకి కదిలిస్తే
తనవాళ్ల కోసం శిలువ వేయబడిన జీస
స్త్రీ జాతి విముక్తి కోసం
రూప కన్వార్ ‘సతీ’ ఒక బలిదానం అవుతుంది!
అందరం నేరస్థులమే
ఏప్రిల్, 2019
ఇంటర్ పిల్లల ఆత్మహత్యలపై
ఇప్పుడెవ్వరిని నిందిస్తే
పోయిన ప్రాణాలు తిరిగొస్తాయి
చేతులు కాలాక తీరిగ్గా
ఆకులు పట్టుకొన్న ఏలిన వారినా ?
మనిషి సంఘజీవని మరచి
పుస్తకాలు పరీక్షలు ర్యాంకులే
వారి ప్రపంచంగా మలచిన
తల్లిదండ్రులు, గురువులనా ?
విద్యను పూర్తిగా కార్పొరేటీకరించి
తమలోకి తాము ముడుచుకునే ఒంటరితనాన్ని పెంచే
జైళ్లుగా విద్యాలయాలను మార్చిన సరళీకరణనా ?
విద్యను ఉచితంగా అందించుట లేదు సరే
పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసినా
పరీక్షల మూల్యాంకనం కూడ
ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వం వాజత్వాన్నా ?
పిల్లల భవిష్యత్తు నిర్ణయించే సందర్భంలో
అంకితభావంతో కష్టించని పశ్చాత్తాపం వదిలి
ఇది ఏటా జరిగే రివాజే అంటూ
సిగ్గు విడిచి మాట్లాడే బ్యూరాక్రసీ నిర్లక్ష్యాన్నా ?
నేను బాగా రాసాను ఎలా తప్పాను
సమాధానం కావాలని గొంతెత్తుతే
భరోసా కల్పించవల్సిన క్షణంలో
భయోత్పాతం సృష్టించిన ఖాకీ రాజభక్తినా ?
ఎవ్వరిని నిందిస్తే
పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి
తిలా పాపం తలా పిడికెడు
లెక్కలు తీస్తూ పోతే నువ్వూ నేను
అందరం కారణభూతులమే
విద్యా పరిపూర్ణ జ్ఞానం అందించే
దశ నుంచి పరీక్షలే పరమావధిగా
ప్రైవేటు జేబుల్లోకి జారుతుంటే
ముప్పది ఏళ్లుగా ఎదురొడ్డి పోరాడలేక
సాక్షీభూతంగా నిలిచిన మనల్ని మనం
సమాధానపరుచుకో గలిగితే కదా
ఎవ్వరినైనా నిందించడానికి
బేరీజు వేసుకుంటూ పోతేనే
చేసిన పొరపాట్లు
చేయాల్సిన పోరాటం తెలుస్తుంది!
ఒంటరితనం ఒక భావనే
15 సెప్టెంబర్ 2017 (గౌరీ లంకేశ్ హత్య అనంతరం)
లోకం అనేది ఒకటి ఉన్నప్పుడు
ఒంటరితనం అనేది ఒక భావనే
క్షణక్షణం నీ ఉనికిని
కుంచించుకుంటూ
నీలోకి నీవు ఇంకిపోవడమే
ఒంటరితనం
వ్యాకోచించడం వ్యాపించడం
ప్రవహించడం జీవ లక్షణం
అడ్డంకులు అవరోధాలు ఏర్పడవచ్చు
దారి మారుతుంది లక్షణం మారదు
పోటు రాళ్లు తగిలి బోర్లా పడవచ్చు
కంప కసువూ ముషీ మసక
దారిలో పరచుకొని ఉండొచ్చు
దారి చేసుకుంటూనో దారి మార్చుకుంటూనో
వ్యాకోచిస్తుంటే
రెండడుగులు లేదా నాలుగడుగుల ఆవల
మనతో కలసి పరిమళించి
పరవశించి వికసించడానికి
ప్రపంచం స్వాగతం పలుకుతుంది
స్వంతం చేసుకోవడం మన వంతు
స్వంతానికి అనుకోవడం స్వార్థం
స్వంతం చేసుకోవడం అనేది మమేకత!
వధించుట కాదు వాదించుట నేర్చుకో!
ప్రపంచానికి సహనం గురించి
పాఠాలు చెప్పిన దేశంలో
అసహనం అంచలంచలుగా
ఇజంగా మారుతుంది
విభిన్న సంప్రదాయాల… ఆదాన ప్రదానంతో
సరికొత్త సంస్కృతికి బాటలు వేసే
భారతీయ సంస్కృతిలో
అసహనం అంచలంచలుగా
ఇజంగా మారుతుంది
మానవ నాగరికత రాతియుగం నుండి
క్రమ వికాసం చెందిందని కాక
దేవలోకం నుండి ఊడిపడిందని
నమ్మేవాడికి
చరిత్రలో దేవతలు, రాక్షసులకు తప్ప
మనుషులకు చోటివ్వని వాడికి
పవిత్రతకు తప్పా
భౌతికం, బౌద్ధికతకు చోటుండదు
బుర్రలో గుడి కట్టుకున్న దానికి భిన్నంగా ఏది చెప్పినా
అది సహించలేని అపవిత్రంగానే కనిపిస్తుంది
తరతరాలుగా గడ్డకట్టి, గడ్డకట్టి
గండుశిలగా మారిన మూఢత్వం
ప్రతీకారంతో బుసలు కొడుతుంది
కాషాయ పాలన కల్పించిన
ఈ రాజ్యం నాదనే భావన
భౌతిక దాడికి పురికొల్పుతుంది
పాస్టరా, ఫకీరా, పత్రికా రచయితా
ఎవ్వరైతేనేమిటి?
తనలాగా ఆలోచించని వాడికి
తన రాజ్యంలో చోటు ఉండదు
ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం
పాఠ్య పుస్తకాల్లో - పాత చింతకాయ పచ్చడైంది
గతితార్కికత పక్కన పెడదాం
తర్కాన్ని శాస్త్రంగా అభ్యసించిన దేశంలో
తార్కికతకూ చోటు లేకుండా పోతుంది
వాదోప వాదాలతో
శాఖోపశాఖలుగా విడిపోయిన వారి మధ్య
సంగీతీలు నిర్వహించిన
బౌద్ధచరిత్రను పక్కన పెడుదాం
నీవు ఆరాధించే ఆదిశంకరుడు
వాదనలతో గెలిచిన చరిత్రనన్నా చదువూ
భౌతికంగా కాదు తార్కికంగా ఎదుర్కో
వధించుట కాదు వాదించుట నేర్చుకో
నీవు నిజంగా భారతీయ సంస్కృతిని
ఆరాధించే వాడివైతే
వధించుట కాదు వాధించుట నేర్చుకో !
పంచభూతాల సాక్షిగా…
సెప్టెంబర్, 2006
లోకానికి లోహాన్ని తెలిపిన
లోహాలను నేను
దేహాన్ని తిత్తిగ చేసి
ఆయువును కొలిమిగ మండించి
రాళ్లు కరిగించి
బతుకు జల్లెడ లోంచి
లోహాన్ని వడగట్టినవాన్ని
లోకానికి లోహాన్ని అందించినవాన్ని
నేను లోహాలను
కమ్మరిని, కంచరిని, కంసాలిని -
పంచాణము వాన్ని
మానవ నాగరికతకు
పంచభూతాలు నేను
పంచేంద్రియాలు నేను
పంచకర్మలు నేను
పంచ ప్రాణాలు నేను
నేను పంచాణము వాన్ని
గొడ్డలినై కొడవలినై
అడవులను సేద్య నేలలుగా
అవతరింప చేసినవాన్ని
పలుగునై పారనై
సాగునీటి వనరుల
తవ్వకమైన వాన్ని
కర్రునై కర్రు మొననై
నాగలినై నాగటి కోలనై
లక్షల ఏళ్ల సంచార జీవితానికి
తెరదించిన వాన్ని
గుహల నుండి గృహాలకు
మానవ నాగరికతను నడిపించిన వాన్ని
ఇరుసునై చక్రాన్నై బండినై
ఆధునిక నాగరికతకు బాటలు పరిచిన వాన్ని
నేను పంచాణము వాన్ని
మానవ నాగరికతకు
పంచభూతాలు నేను
పంచేంద్రియాలు నేను
పంచ కర్మలు నేను
పంచ ప్రాణాలు నేను
శిలాయుగంలో శిల్పిని
కంచుయుగంలో కంచరిని
లోహయుగంలో కమ్మరిని
మధ్యయుగంలో అవుసలిని
చరిత్రంతా పరుచుకొన్న వడ్రంగిని
నేను పంచాణము వాన్ని
కతినై కవచాన్నై శిరస్తానమై
సైన్యాలకు విజయాలు అందించిన వాన్ని
బండినై ఓడనై సందుకనై
నగనై నట్రనై కళాకృతినై
వ్యాపారులకు లాభాలు పండించిన వాన్ని
గుడినై గుడి గోపురమై
గుడిలో మూర్తినై
గుడి గంటనై
ద్విజులకు ప్రశస్తి కల్పించినవాన్ని
పలికే సప్తస్వరాలలో తంత్రిని నేను
నర్తించే పాదాల మువ్వలు నేను
జాలువారిన అక్షరాల ఘంటం నేను
బ్రతుకును రంగుల్లో చిత్రించే కుంచెను నేను
నేను రైతు నాగలినే కాదు
సాలీల మగ్గాన్ని… కుమ్మరి సారెను
గౌడుల కత్తిని… మాదిగల ఆరెను
మంగలి కత్తెరను… జాలరి పడవను
సమస్త వృత్తుల పనిముట్టును నేను
నేను పంచాణము వాన్ని
రాయిని రత్నాన్ని
కట్టెను కనకాన్ని
ఇనుమును ఇత్తడిని
జీవితానుభూతులుగా
చిత్రిక పట్టిన వాన్ని
జీవన సోపానానికి
మెట్లుగ మలిచిన వాన్ని
నేను పంచాణము వాన్ని
చరిత్రను నా వీపుపై మోసిన వాన్ని
స్వంత అనుభూతులు లేకుండా
సమాజం కోసం బ్రతికిన వాన్ని
చరిత్ర గమనంలో సమాజగతిలో
చతికిలబడి చితికి ఛిద్రమైన చిత్రాన్ని
విపణివీధిలో విచలుడనై నిలిచిన వాన్ని
బ్రతుకు పంచకూళ్ల కషాయమైన వాన్ని
పంచకులాల వాన్ని
నేను పంచాణము వాన్ని
విశ్వకర్మనని మురిసే వాన్ని
నేను పంచాణము వాన్ని!
పెద్దన్న పద్ధతి మార్చుకో
3 అక్టోబర్, 2017 (అక్టోబర్ 2, 2017లో లాస్ వేగాలో ఒక సంగీత కార్యక్రమంపై స్టీఫెన్ ప్యాడక్ జరిపిన కాల్పులలో 58 మంది మరణించగా 515 మంది గాయపడిన సంఘటన పై)
పచారి కొట్లో సరుకుల్లాగ
తుపాకులు కొనుక్కొని ప్రదర్శిస్తూ
బజాట్లో తిరిగే చోట
వ్యభిచారం జూదం నేరం కానిచోట
మనుషుల్ని చంపడం మాత్రం
నేరమని ఎవ్వరు భావిస్తరు
జీవగడియారాన్ని సవాలు చేస్తూ
రాత్రిళ్లు
తాగుడు తైతక్కలు తన్నుకొనుడు
వ్యభిచారం జూదం మోసం దొమ్మీలతో
మరో లోకంలో విహరించి
పగలు తొంగొనే నిశాచరులకు
పాపం పుణ్యం వివేచన విచక్షణా
మొత్తంగా మానవ నైజం
మనసులలో మనుగడ సాగిస్తుందంటారా!
ఓహూ అగ్రరాజ్యమా
లాస్ వేగాస్ వేదికగా
ప్రపంచానికి నీవందించిన
నిశ నిషా నీచ సంస్కృతికి
పరాకాష్ట స్టీఫెన్ ప్యాడర్
ప్రపంచానికి ఇప్పటికి జరిగిన నష్టం చాలు
ఎప్పుడూ ఇతర రాజ్యాలను ఆడిపోసుకోవడం కాదు
ఇప్పటికైనా బాధ్యతాయుత రాజ్యంగా
లాస్ వేగాసను Sin City నుంచి Sun Cityగా మార్చు !
చర్విత చరణం
అక్టోబర్, 2017
మొన్న ‘నీరు - మీరు’
నిన్న ‘ఇందిరమ్మ చెరువులు’
నేడు ‘మిషన్ కాకతీయ’
తవ్విందే తవ్వుతున్నరు
చేసిందే చేస్తున్నరు
అని కాగ్ భలే చెప్తుంది
పాలకులు మారి పేర్లు మారితే
చెరువులు కొత్తగా పుట్టుకొస్తాయా
గుత్తేదారులు కొత్తగా పుట్టుకొస్తారు… కనీ
చేసుకున్న వారికి చేసుకున్నంత మహా
ఎవ్వరికి చెందాల్సినవి వారికి చెందాలి కదా
అందుకే అప్రధాన్య అంచనాలు పెరుగుతాయి
ఏపథకమైతేనేమి లక్ష్యం మంచిదే
అమలే ఆమెడ దూరం ఈ దేశంలో
అందుకే ఎంత తవ్వినా చెరువులకు
కాకతీయుల కళ రావటం లేదు !
అరువడి బతుకు
అక్టోబర్, 2006
ఏ దినం నీకేమక్కరపడుతదో నని
దాతి మొద్దుకు పంతా పాతరేసుకొని
డాకలికి కాళ్లు కట్టేసుకొని
ఎద్దుకంటె ముందు
సాలెల్ల నీకు సాకిరీ చేస్తే
సాలాఖరుకు నీవు నాకిచ్చేది
బిచ్చమెట్లాయే!
పండగ లేదు పబ్బం లేదు
చుట్టాలు లేరు తీర్థాలు లేవు
పెండ్లిళ్లకు చావులకు కూడా పోకుండా
పంట చేండ్ల దిష్టిబొమ్మోలే
గోడకు కొట్టిన సున్నమోలే
ఊరు కదలకుండా బతుకంతా ఆనుగర్రనై
ఊతమిస్తే నా ఆకలి తీర్చిందెప్పుడు?
దాతి మొద్దుకు పంతా పాతరేసుకొని
డాకలికి కాళ్లు కట్టేసుకొని
సాలెల్ల నీ
కోసం బతికితే
సాలాఖరికి నీవిచ్చేది
బిచ్చమెట్లాయే!
నీ వరి కోత్తాండ్లని తెల్సి
పొలంల కచ్చి నాలుగు పంజలుకత్తె
నీ ఇల్లాలు కళ్లెర్రజేసి
ఆడుదూడంటూ రెండు పంజలు తీసేసే!
అదునెక్కడ తప్పుతుందోనని
ఏగిలి బారంగ లేసి కొలిమి రాజేస్తి
పొద్దు కరకర పొడవక ముందే
పెద్ద బాడిసే గాల్లోకి లేపితి
ఎదనాగలి బురద నాగలి
ఎదగొర్రు బురద గొర్రు
ఎన్ని మొద్దులు చెక్కితే
ఎంత ఇనుము సాగదీస్తే
ఈ వరి పండింది?
పనికొచ్చేకాడ నీవాయే
బిచ్చం పెట్టెకాడ నీ ఇల్లాలాయె !
మొన్నటికి మొన్న
మక్కజొన్న కంకులడుగుతే
మీ ఆమె మంచెత్తెగిరి
కర్ర కర్రకో తిట్టు తిట్టుకుంట
గింజలు పెట్టని పరిగెబుడ్డలేరిచ్చె
మక్క సాలుబెట్టిన నాగలెవ్వడు జేసె
సాల్లల్ల కొట్టిన గుంటుకెవ్వడు జేసె
కలుపు తీసిన కొడవలెవ్వడు జేసె
నీళ్లు కట్టిన పారెవ్వడు జేసె
కంసాలోని కష్టం లేకుండనే
మక్కజొన్న పీసు తోడిందా?
కడకు కాల్చుకతినే కంకులకు
కంసాలోడు పనికి రాకుండపాయె
ఎన్నెన్ని చెప్పను…. ఏదడిగినా
ఎంగిలి మెతుకులు రాల్చినట్లేనాయె
అయిన నిన్ననే మీ లాభం
పండుగ పబ్బం లేకుండా
కట్టు బాంచెలా
సాలెల్ల పనిజేసి
సాలాఖరికి ఫలితం తీసుకోవాలని
కట్టడి పెట్టినోన్ని అనాలి
కులాలు కుల కట్టుబాట్లు పెట్టినోన్ని అనాలి
తాత ముత్తాతల నుండే వచ్చే పద్దతని
ఈ అరవడి బతుకు నుండి తెగించి
బయట పడని నా చేతగానితనాన్ని అనాలి !
ఇంకెన్నాళ్లు
20 అక్టోబర్, 2017 (ఒత్తిడితో ఐదుగురు హాస్టల్ విద్యార్థులు ఒకే రోజు చనిపోయిన వార్త విని)
ఊళ్లో నీ ఈడు వారందరికీ పెళ్లవుతున్నవి
పెళ్లి చేసుకో అని పోరేది చిన్నప్పుడు మా అమ్మ
చదువే పూర్తి కాలేదు ఉద్యోగం దొరుకుతుందో లేదో
పెళ్లి చేసుకొని ఎట్లా బ్రతుకుతరంటే
చెరో కొడవలి పట్టుకొంటే కోతకు పోయి బతుకచ్చు
ఉద్యోగం రాకుంటే బతికేదెట్లని భయపడతరా అనేది
నవ్వి ఊర్కునే వాన్ని - నా కప్పుడు తెల్వలే
నాపై నా భవిష్యత్తుపై నాకు భరోసా పెంచడానికి చెప్తుందని
కాలం మారింది
బాధ భయం భవిష్యత్తుపై ఆందోళనను
పంచుకోవాల్సిన తల్లిదండ్రులే వాటి కారకులైతే
అయోమయం గజిబిజిలో దారి తెలియనప్పుడు
మార్గదర్శనం కావాల్సిన విద్యాలయాలే
ఆ అవస్థకు కారణమైతే
మీకు శ్రీరాముడు కప్ప కథ తెలుసు కదా
అచ్చం అలాంటి పరిస్థితే పిల్లలది ఇప్పుడు
ఎవ్వరికీ చెప్పలేక కక్కలేక మింగలేక
ప్రాణం తీసుకుంటున్నారు
తల్లిదండ్రులు విద్యాలయాలు కలిసి చేసే
ఈ హత్యలు ఇంకెన్నాళ్లు…..?
బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు
జూన్, 2018 (బయ్యారంలో ఉక్కు పరిశ్రమకు అనుకూలత లేదనే ప్రకటన చదివి)
నినదిద్దాం నినదిద్దాం
బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు అంటూ
కిన్నెరసాని సనసన్నగా పాడుతూ
సమీపాన పారెనదే
గల గల గోదారి తలాపున పరవళ్ళు తొక్కే
సిరులు కురిసే సింగరేణి
చెంతనే కొలువు దీరే
ఉత్తర దక్షిణ భారతాన్ని కలిపే
తాతలనాటి రైలుమార్గం దాపునే ఉండే
అనుకూలత కాదనే అనుమానాలు ఎలా
కమిటీలు కాలయాపన ఇప్పటికిక చాలు
నినదిద్దాం నినదిద్దాం
బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు అంటూ
రాతి మీద చారెడు పండించుటే
సాంకేతికత
వడ్డించిన విస్తరిలో భుజించుట
కాదు కదా వ్యాపారమంటే
అడ్డంకులను అధిగమించి అందలమెక్కుటే కదా
మనసుంటే మార్గం ముండు
చిత్తశుద్ధి మొదట ప్రధానం
సిద్ధించును వనరులవే
నిజాంను తిట్టి తిట్టి నిదుర మరచిన రాత్రులెన్నో
ఆంధ్రాళ్లను వేలెత్తి చూపి చూపి
అలసిన రోజులెన్నో
సల్లొదిలితే ఇప్పుడు అలు సైదుము సుమా
తెలంగాణ తెగువ చూపి
నినదిద్దాం నినదిద్దాం
బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు అంటూ
కేంద్రమా రాష్ట్రమా ఉమ్మడా
స్థాపన ఏ విధమైనా సరే
సాధించుటే కర్తవ్యం
ఉద్యమించుటే మార్గం
నినదిద్దాం నినదిద్దాం
బయ్యారం ఉక్కు - తెలంగాణ హక్కు అంటూ
నినదిద్దాం నినదిద్దాం !!
సౌకర్యాలు కాదు చిత్తశుద్ధి కావాలి
22 అక్టోబర్, 2017 (తప్పుల తడక, మహానగర ప్రణాళిక వార్త చదివి)
బ్యారేజీలు కట్టడానికి ముందు
సర్ ఆర్థర్ కాటన్ గుర్రం వేసుకొని
నాసిక్ నుండి అంతర్వేది వరకు
గోదావరిని చుట్టేశాడటా
ఇప్పుడు ప్రణాళికలంటే
ఏసీ గదుల్లో పవర్ పాయింట్స్
కావాలంటే చూడండి
హైదరాబాద్ మహా ప్రణాళికను
రవాణా సౌకర్యాలు సాంకేతికత ఇంతగా పెరిగాక
క్షణాల్లో సమాచారం అందిపుచ్చుకునే రోజుల్లో
ఇన్ని తప్పులా
ఎంత చిత్తశుద్ధి మనం చేసే పనిపై!
భావి అభివృద్ధిపై భవిష్యత్తు తరాలపై
ఎంత అంకిత భావం!
ఇప్పుడు దిద్దుబాటు ఆరంభించారు సరే
ప్రణాళికే ప్రామాణికంగా జరిగిన నష్టం సంగతీ
ఇప్పటికే మాయమైన చెరువులు
కుంచించుకు పోయిన నాలాలు
అడ్డదిడ్డం రోడ్లు అక్రమ లేఅవుట్లూ
భావి తరాలకు శాపం కాకుండా
ప్రభుత్వం చర్యలు చేపట్టాలి మరి!!
సాక్షాత్తు మానవుడు
నవంబర్, 2003 (కాళోజీ మొదటి వర్ధంతి సందర్భంగా)
ప్రాణం కవిత్వమే
దేహం కవిత్వమే అయితే
సంసారం కవిత్వమే
సంతానం కవిత్వమే అవుతుంది
బాంధవ్యం కవిత్వమే
స్నేహం కవిత్వమే అవుతుంది
జీవితమంటే కవిత్వం తప్ప
మరోదానికి చోటు లేనప్పుడు
కవిత్వమంటే గొడవపడటమే
అయినప్పుడు
గొడవ పడటమే జీవితంగా
జీవించడం
అనన్యం, అపూర్వమేకాదు
అదొక అద్భుతం కూడా
అందుకే కాళోజీ అంటే
ఈ యుగపు ఒక అద్భుతం
గొడవ పడటమే
ఆకలి ఆహారంగా
గాలి, నీరుగ బ్రతికనవాడు
కాళోజీ
న్యాయం సార్వత్రికం కాదన్న సూత్రానికి
కాళోజీ ఒక అపవాదు
న్యాయానికి మానవత్వం గీటురాయిగ
కాళోజీ చేసుకొన్నాడు
మానవత్వం సార్వత్రికం అయితే
న్యాయం సార్వత్రికమే అవుతుంది
న్యాయం సార్వత్రికం అయినప్పుడు
న్యాయం కోసం గొడవపడటం
సార్వత్రికమే అవుతుంది
గొడవ పడడానికి
స్థలం, కాలం, పూర్వపర సంబంధాలు
ఇజాలు, బేషజాలు ఏవీ అడ్డంకి కావు
ఎందుకంటే మానవత్వ మొక్కటే
గీటురాయి అవుతుంది కాబట్టి
మానవత్వమంటే
జరుగుతున్న అన్యాయానికి
సాక్షీభూతంగా నిలవడం కాదు కదా
ప్రశ్నించి ఎదురొడ్డి
న్యాయం జరిగే వరకు గొడవపడటం
న్యాయంగా ఈ లోకంలో
న్యాయం ఎప్పుడు జరుగుతుంది ?
కాబట్టి గొడవ పడటమే
జీవితమవుతుంది
న్యాయానికి మానవత్వమే గీటురాయి
అయినప్పుడు
మానవునికి మానవత్వమే కొలమానం
అయినప్పుడు
ఆ మానవునికి జీవితమంటే
గొడవ పడటమే అవుతుంది
కాళోజీ సాక్షాత్ మానవుడు
అందుకే గొడవ పడటమే
జీవితంగా జీవించాడు !
సంసిద్ధత ఎక్కడైనా ఒకటే
అక్టోబర్, 2017 (వరంగల్లు ‘రోహిణీ’ హాస్పటల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో రోగులు మరణించిన సంఘటనపై)
విద్యాలయాలు వైద్యశాలలు కార్ఖానాలు ఏవైతేనేం
పాటించే వ్యాపార సూత్రం ఒకటే
ఖర్చు తగ్గించు లాభాలను పెంచు
అందుకే ఎప్పుడో వచ్చు ఉపద్రవం కోసం
ముందస్తు సంసిద్ధత పై పెట్టుబడి
నిరర్ధకపు ఖర్చుగా కనిపిస్తుంది
ఇది ఎల్లెడలా వేళ్లూనిన సంస్కృతి
ప్రమాదాలు జరిగినప్పుడే ప్రీ మెజర్మెంట్స్
అందరికీ గుర్తుకు వస్తాయి
హడావుడి విచారణలు పైరవీలు లాలూచీ
నాలుగు రోజుల్లో గచుప్ షరా మామూలే
వ్యాపారమైనా ఉద్యోగమైనా వృత్తైనా
లాభాలకంటే ప్రాణాలకు విలువిద్దాం
ఎప్పుడో కాని రాని యుద్ధం కోసం
సైనికుడు ప్రతిక్షణం పహారా ఎందుకు కాస్తాడు
రక్షణకు ముందస్తు సంసిద్ధత ఎక్కడైనా ఒకటే
సరిహద్దు, సంస్థ, పని స్థలం… ప్రయాణం ఏదైనా
ఈ భావం అందరిలో పెంపొందాలి!
వీణా వాణీలు
అక్టోబర్, 2017
చూస్తూ చూస్తూనే పదిహేనేళ్లు గడిచాయి
ప్రభుత్వాలు మారాయి పాలకులు మారారు
రాష్ట్రాలు వేరయ్యాయి
వీణా వాణీల తలలు వేరు కానేలేదు
వేరు అయితవా కావా ఇంకా సందిగ్ధమే
ఆపరేషన్ అంచుకుపోయి మళ్లీ మొదటికి వస్తూంటే
అశక్తమై ఎటూ పాలుపోని సందిగ్ధంలో
పద్నాలుగేళ్లుగా పిల్లలు, వారి తల్లిదండ్రుల
మెదళ్లు ఎలా క్రష్ అయినాయో
వర్ణించే అక్షరాలు ఉన్నాయా
విద్యా వైద్యం ప్రభుత్వాల ప్రథమ కర్తవ్యం అయితే
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసే కోట్లల్లో
వీణా వాణీల పేర్లేందుకు రావు
బిలియనీర్లు సమాజ సేవ పేరున విదిలించే
కోట్లు వీణా వాణీలను ఎందుకు చేరుట లేదు
వారికి చేయి అందించవలసిన బాధ్యత
ఈ ప్రపంచంపై లేదా
మనం ఆలోచిద్దాం ఈ ప్రపంచంలో ఒకరిగా!
బరితెగించిన అభివృద్ధి
ఆగస్టు 2018
మంచిదే యాదగిరిని అభివృద్ధి చేద్దాం
రద్దీ పెరిగితే వ్యాపారం పెరుగుతుంది
పసిమొగ్గలను చిదిమేస్తూ వాళ్లు
లక్షలు సంపాదించుకోవాలి కదా
ఇప్పుడు యాదగిరి అభివృద్ధికి నమూనా
అక్కడి భూములు భూమిపుత్రుల చేజారి
ఎన్ని చేతులు మారాయో!
తల్లి కొంగు వీడిన చిట్టి తల్లులు
ఎన్ని చేతులు మారారో
చేతులు మారినప్పుడల్లా
బ్రోకర్లర్ల జేబులు నిండుతాయి.
ధరణి తరుణి ఏదైనా ఇప్పుడక్కడ
తార్చడమే వ్యాపారం
పైసా మే పరమాత్మ ధనమే దైవం
దేవుడన్నా జాతరన్నా జరిగేది వ్యాపారమే కదా
ఇప్పుడు మనకు అభివృద్ధి అన్నా వ్యాపారమే
ఎవ్వడి వ్యాపారం వాణ్ణి
కోట్లు కుమ్మరించి యాదగిరిని అభివృద్ధి చేద్దాం
పునరావాసం తక్షణ చర్యలు మానవీయత
ఇవ్వన్నీ చరిత్రలో నిలిచే ముచ్చట్ల
మన చరిత్ర శిలాక్షరమై నిలవాలంటే
భవిష్యత్తు తరాలకు పాటగా వినిపించాలంటే
అద్భుత శిల్పాలు సుందర ఆలయాల
నిర్మాణాలకంటే మించిన పని ఏముంటుంది
చరిత్రను ఒక్కసారి పరికించండి
రాజుల సొమ్ము రాళ్ల పాలు
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా
సొమ్ము ఏలికలది కాదు అది మనదని
మనకు సోయి రానంత వరకూ
మనమిప్పుడు
శిల్పాల సొగసులను గానం చేద్దాం
రోమ్ కాలి పోనీ ఫిడేలు వాయించేద్దాం
కళా పోషణ ముఖ్యం మరీ!
ఇహం దేముంది పరం ముఖ్యం
పారమార్థిక సేవలో పులకించి పోదాం
యాదగిరి ఆ పేరంటేనే తెలంగాణ ఐకాన్
కానిప్పుడు అది యాదాద్రి అయింది
యాదాద్రి అంటే తెలంగాణ యాస కాదు
చినజీయర్ స్వామి వేషం కనిపిస్తుంది
మోటళ్లు రిసార్ట్స్ ఏవేవో హంగామాలతో
అక్కడ విధ్వంసం అవుతున్న ప్రకృతి సాక్షిగా
పరాయిదైనట్లు అనిపిస్తుంది
కోట్ల ప్రజాధనంతో కొత్తగా ముస్తాబవుతున్న
ఉగ్ర నరసింహుని ప్రాపకంలో
విలువలు మరిచిన అధికారం రాజకీయం బాసటగా
జరుగుతున్న మాఫియా వ్యాపారం కనిపిస్తుంది
ఆడపిల్లలను దాయడానికి బంకర్లు తవ్విన
బరితెగించిన అభివృద్ధి కనిపిస్తుంది!
సమతుల్యత
17 ఆగస్టు, 2018
శత్రువు మెచ్చుకుంటేనే
అది అసలైన వ్యక్తిత్వం
సిద్ధాంతాలు వ్యతిరేకించే వాడు
శ్రద్ధగా వింటేనే గొప్ప ఉపన్యాసం
విపక్షాలు పొగిడితేనే
సరైన పరిపాలన
పదవులకై విలువలు వదులుకుంటేనే
నిజమైన నాయకుడు
నిన్ను అత శత్రువు చేసింది
తకతనం కాదు నైతిక విలువలు
నీవు అతివాదుల్లో మితవాదివి
అనుట అర్ధసత్యం
వాదాల కంటే దేశ శ్రేయస్సు ముఖ్యమని
నమ్మకాలకన్నా ప్రజా బాహుళ్య
సహజీవనం మిన్నయని
నమ్మిన రాజనీతిజ్ఞుడివి
నాయకులలో రాజకీయాలు తప్ప
రాజనీతి శూన్యం అయిన వేళా
నీవిప్పుడు ముచ్చటించుకోవడానికి
ఒక ఆదర్శం మాత్రమే - అటల్ జీ!
ఇంటికంటే గుడి పదిలం
ఏప్రిల్, 2018
తరతరాలుగా నీవు అజ్ఞానాన్ని పంచడానికి
ఆలంబన గుడి
తరతరాలుగా నీవు పరాన్నభుక్తుడిగా బ్రతకడానికి
ఆధారం గుడి
వర్గాలు వైషమ్యాలు కులాలు అంతరాలు సృష్టించి
నిన్ను ఉన్నతుడిగా చేసింది గుడి
పురషస్వామ్యానికే కాదు - దోపిడీకీ పునాది గుడే
అందుకే శ్రమ దోపిడే కాదు
లైంగిక దోపిడీకి గుడి నీకు బాసటైంది.
గుడి నిన్ను ఆవును పవిత్రంగా చూడమంది
అమ్మను ఆస్తిగా సుఖాలనిచ్చే
అవయవాల కళేబరంగా చూడమంది
నీ
గొప్పతనం ప్రదర్శించడానికి
చెప్పినట్టు పడివుండే ఆడజాతిగ చూడమంది
పాపం ఆసిఫా ఎనిమిదేళ్ల పసిపాప
అయితే ఏం ఆడదే కదా!
అవే అవయవాలు కదా
ఓడినవారి స్త్రీలను చెరపట్టిన రాజుల్లా
విజయాట్టహాసంతో లేలేత అవయవాలపై
కసిదీరా దాడి చేసావు
కామం క్రౌర్యం ఉన్మాదపు ఉత్సుకత
పురుషస్వామ్యపు అభిజాత్యం
తీర్చుకోవడానికి
నీవు నమ్మే దేవుడి సాక్షిగా
గుడి వేదికైంది
గుడి నీ మేధ నీ సదా నీ రక్షణ కవచం
అది మందిరం మసీదు చర్చ్
ఏదైనా కానీ
అది నీ మేధ నీ సదా తరతరాల నీ రక్షణ కవచం
అందుకే సాంజీ రామ్
ఏలికలు నీ వెనకాల నిలిచింది
సాంజీరామ్ నిజం మాట్లాడుకుందాం
ఆసిఫా పై జరిగింది కామోద్రేకపు బలాత్కారమా
వారి స్త్రీలను చెరపట్టుట కూడా
ఎదుటివారిపై విజయం నమోదుచేయుట అనే
ఆదిమ సంస్కృతి ప్రాతినిధ్యమా
ఆసిఫా పై జరిగింది ముమ్మాటికీ రేప్ కాదు
స్త్రీ
జాతిని నీ సంస్కృతి చూసే తరిఖాకు చిహ్నం
సాంజీ రామ్ మీరు ఎంత వెనక్కి వెనక్కి
ఈ దేశాన్ని నడిపించాలని చూస్తే
అంతకంతగ మేము ఎదురు తిరిగి పోరాడుతాం
మా విజయాలపై మాకు నమ్మకముంది
చౌదరి లాల్ చందర్ ప్రకార్ల
రాజీనామాలే సాక్ష్యం!
ఇదేనా సామాజిక న్యాయం
14 అక్టోబర్, 2017 (మాతాశిశు సంక్షేమ శాఖ పై వచ్చిన ఒక వార్తపై..)
భారత్ వెలిగి పోతుంది
శుష్కించిన భావిపౌరుల చెక్కిళ్ల ముడతలలోన
ప్రాజెక్టులు ప్రణాళికలు హరిత విప్లవాలు
అన్నార్తుల దరికి మరి అవి చేరనే లేదు
ఆహార ఉత్పత్తిలో రెండో స్థానం
ఆకలి సూచీలో 100వ స్థానం
ప్రపంచంలో ఇది మన ప్రస్థానం
చూడండి ఎంత గొప్ప సామాజిక న్యాయమో
మాతా శిశు సంరక్షణ కేటాయింపులలో
చిత్తశుద్ధి ఎంతో
అమలులోని లోటుపాట్లలో
ఎవ్వరి పాపం ఎంతో
పసిపిల్లలకు పౌష్టికాహారం అందించని
అభివృద్ధి అది ఎలా
ప్రశ్నిద్దాం పాలకులను
బలాఢ్యుల భావి భారతం కోసం!
చట్టం కంటే ఆచారం బలం ఎక్కువే
13 అక్టోబర్, 2017
బాల్య వివాహాల గణాంకాలు చూసి
అవాక్కయ్యింది సుప్రీంకోర్టు
రెండు కోట్లా ముప్పై లక్షల మంది ముక్కుపచ్చలారని
ముత్తయిదువులున్నరంటా
జరిగే అయిదు పెళ్లిల్లో ఒకటి బాల్య వివాహమంటా
హవ్వా! అని ముక్కున వేలేసుకునే లెక్క మరి
ఆచారాలు పెళ్లిళ్లలో
బహు దొడ్డగ పని చేస్తాయండి
చట్టం కంటే ఆచారం
బలం బహు ఎక్కువండి
బాల్య వివాహ నిఘం వరకట్న నిషం
చట్టాలు ఉన్నాయని చెప్పుటకే పనికి వస్తాయి
చదువు, ఆర్థిక స్థితి బలాదూర్ ఆచారాల ముందు
కులాచారాలు మతాచారాలు
కరడుగట్టిన మూఢ సంప్రదాయాలు
గణాంకాలు తగ్గకుండా పహారా కాస్తున్నాయి
ఎన్నడైనా ఆడపిల్ల అక్కడి పిల్లేనని
ఎంత త్వరగా ఇంటి నుండి సాగనంపితే
అంత శ్రేయస్కరం అనే
అనాది ఆలోచన భారతీయ మెదళ్ల నుండి
పెళ్లగించవలే సుమండీ!
ఎన్నాళ్లు ఈ త్రిశంకు స్వర్గం
అక్టోబర్, 2017 (“దిక్కుతోచని సమస్యల సుడిగుండంలో విశ్వవిద్యాలయాలు’ అనే వార్త చదివి)
విశ్వ విద్యాలయాలు పెరిగాయి
అధ్యాపకులు తగ్గారు
కోర్సులు సీట్లు పెరిగాయి
చేరే విద్యార్థులు తగ్గారు
ఏం జరుగుతుంది ఉన్నత విద్యలో
ప్రాథమిక పాఠశాల లాగే
విశ్వవిద్యాలయాలు మూసివేయరుగా!
భయమేస్తోంది
బయట ఉన్నత విద్య ప్రైవేటీకరణకు
బార్లా తలుపులు తెరిచి ఉన్నాయి మరి
వీసీల కోసం మూడేళ్లు ముఖం వాచింది
అధ్యాపకుల నియామకాలు హన్మంతుని పెళ్ళైంది
బోధనేతర సిబ్బందికి దిక్కెక్కడిది
మెస్ చార్జీలు రావు హాస్టల్స్ బాగుపడవు
నిర్వహణ నిధులు రావు సున్నాలకు కూడా గతుండదు
నిజం చెప్పండి త్రిశంకు స్వర్గంలో ఉన్న
అధ్యాపకుడు అంకిత భావంతో బోధిస్తాడా
చదువు చెప్పే వారు ఉండరు
చదువైనాక కొలువు రాదు
పోనీ పీహెచ్ డీలో చేరుదామన్నా ప్రవేశాలుండవు
ఏ విద్యార్థి ఆసక్తిగా చదువుతారు చెప్పండీ
చదువేవాడు చదువు చెప్పేవాడు
ఈ సంస్థ నాది అని
ఫీల్ కాలేని పరిస్థితి
ఉత్తమ నైపుణ్య మానవ వనరులను
దేశానికి అందించవలసిన విశ్వవిద్యాలయాల్లో
ఇంత గందరగోళమా
పాఠశాల విద్యలాగ చేజారకముందే
కాపాడుకునే కర్తవ్యం మన మీద ఉంది !
అస్తిత్వ పతాకాలు
4 అక్టోబర్, 2017 (కరీంనగర్, గంగాధర మండలంలో దేవునికొండ’ ఆగిపోయిన ఫైలులో కదలిక వార్తపై)
అమ్మడానికి అలవాటు పడిన వానికి
ప్రతీ గుట్ట కరెన్సీ కట్టల్లాగే కన్పిస్తుంది
దేవుని గుడి చారిత్రక ఆనవాళ్లు కళాసంపద
పనిలేనివాళ్లు ఉబుసుపోక ట్రాష్
విముక్త తెలంగాణలో కొత్తగా
చరిత్రను పునర్నిర్మిస్తామన్న పాలకులను
ఆగిపోయిన ఫైళ్లకు కాళ్లెలా వచ్చాయో నిలదీద్దాం
విధానాలు పునః సమీక్షించవలసిన
అవసరాన్ని నినదిద్దాం
బోడిగుట్టలను ఎలాగూ భోంచేసారు
పర్యావరణాన్ని ప్రభావితం చేసే
కొండల్ని పెద్దగట్లని కూడ వదిలి వేయరా
జరిగిన విధ్వంసం చాలు
ఇది కాకతీయులు కదలాడిన నేల
కొండలు ఆలంబనగా తటాకాలు నిర్మించే సంస్కృతికి వారసులం
పగలేసి పరదేశాలకు అమ్మడానికి కాదు
సహజ నీటివనరు సకల జీవులకు ఆదెరువు
ఊరుమ్మడి సుస్థిర ఆదాయవనరు
ఎవ్వడి వ్యాపారం కొరకో పగలేస్తుంటే
పట్టనట్టు చేతులు కట్టుకుని చూస్తామా
మా గుట్టలు మా కొండలు మా అస్తిత్వ పతాకాలు
కనుమరుగు కానివ్వమని కదులుదాం!
షరా మామూలే
30 సెప్టెంబర్, 2017 (ఏల్ఫిన్ స్టోన్ వంతెన కూలిన సంఘటనకు స్పందించి)
రద్దీ పెరిగింది రైళ్లు పెరిగాయి
ఇరుకు వంతెన అలాగే ఉండిపోయింది
నూట యాభై ఏళ్ల భారత రైల్వేలకు సాక్ష్యంగా
ఈ వంతెన మమ్మల్ని ఎప్పుడో చంపేస్తుందన్న
వాణిజ్య రాజధాని వాసుల మాటల్ని
ప్రభుత్వాలు పట్టించుకోనేలేదు
ఇప్పటికైనా ఈ దుర్ఘటన
ప్రభుత్వాన్ని కదిలిస్తుందని చెప్పలేం
ఎందుకంటే రైల్వేశాఖలో ఏల్ఫిన్ స్టోన్ సంఘటన
మొదటిది కాదు చివరిది కూడా కాబోదేమో
పరుగుల జీవితంలో పడి
ప్రజలు ఉద్యమించనంత కాలం!
చారిత్రక నేరం
27 సెప్టెంబర్, 2017
ప్రకృతి పండుగ ఫక్ రాజకీయమై పోయింది
పునాస పంటల సత్తులు ప్రకృతికి అర్పించి
పరస్పరం పంచుకొనే తంగేడు పూల పండుగ
కోట్లలో ఖర్చు జరిగే ఖరీదైన పండుగైంది
మెట్ట రైతుల పండుగకు హైటెక్ హంగులచ్చినవి
శ్రమజీవుల చుట్టుకాముడకు కార్పొరేట్ కల్చరచ్చింది
ఇప్పుడు బతుకమ్మ ఆట అంటే
డీజేలు డిస్కో డాన్సులు దాండియాలు
గర్భనృత్యాలు చిందులు శివాలు
తెలంగాణ ఉద్యమంలో
అస్తిత్వ పతాక అయి
అందరినీ ఒకటి చేసిన బతుకమ్మ
ప్రాంతీయ స్థాయి నుండి
ప్రపంచ స్థాయికి చేరితే
అందరం సంతసించాము
అంతలోనే ఇంత పరాయీకరణా
మూలాలే మారిపోయి - ముందు తరాలు
బతుకమ్మ అంటే ఇదే అనుకునేంతగా
కలుషితం చేయడం
ద్రోహం చారిత్రక నేరం కాదా!
ఆగమాగం
28 సెప్టెంబర్, 2017
దెబ్బ మీద దెబ్బ పడి
ఆర్థిక వ్యవస్థ కుదేలైందని
ధైర్యంగా నోరు విప్పే యశ్వంత్ సిన్హా
నోట్ల రద్దు నుండి కోలుకోకముందే
జీఎస్టీ మోతతోని
కుదేలయే చిన్న పరిశ్రమలు
దివాళాయే బ్యాంకులు
నమ్మకంతో పెట్టుబడి దొరికే
పరపతి సున్నాయే
జీఎస్టీ స్లాబులు రిటర్న్ దాఖలు
ఆగమాగం అయోమయంలో వ్యాపారులు
గందరగోళంలో ఆర్థిక వ్యవస్థ
క్షీణించిన జీడీపీ సాక్ష్యమాయే
ప్రతిపక్షాల వాగుడుగా
ఇన్నినాళ్లు కొట్టి వేసినా అరుణ్ జైట్లీ
నేడు పారిశ్రామికవేత్తల సదస్సులో
సమీక్షించుట అవసరమని అంగీకరించారు
ఒంటెద్దు పోకడలకు బ్రేక్ పడి
పాలకులు అన్ని శ్రేణులను పరిగణించి
నష్టాలు పూరించ సమీక్షించి మేలుచేస్తే
మనం పలుకుదాం జేజేలు!
తాడు లేదు ముస్తాదు లేదు కల్లు ఉంది
నవంబర్, 2016 (2016లో కత్తీ కల్లు తాగి చచ్చేవాళ్లు చస్తుంటే ప్రభుత్వం డిపోలను వేలం వేయడం, అవి లక్షలాది రూపాయలు పలికిన వార్తలు చూసినప్పుడు)
మనకు తెలిసి కల్లంటే
తాటిగెల నుండి బొట్లు బొట్లుగా రాలే
బెల్లపు నీళ్లు
మనకు తెలిసి కల్లంటే
ప్రకృతిలో ఏ పదార్థం అందించలేని
‘సి’ విటమిన్ అందించే పోషకం
అజీర్తిని అశీర్తను మూత్రవ్యాధులను
తగ్గించే ప్రకృతి ఔషధం
వడదెబ్బ నుండి రక్షించే
పులిసిన గ్లూకోజు నీళ్లు
పోతాడు కల్లు తాగితే వంటికి పుష్టి
పండు తాడు కల్లు తాగితే పండ్లు తిన్నంత బలం
పరుపు తాడు కల్లు తాగితే పరుగో పరుగు
కల్లంటే ఋతువులు కాలంతో పాటు
రుచి పోషకాలు మారుతాయి
సీజన్ అన్సీజన్ లభ్యం అలభ్యం ఉంటుంది
మరయితే ఇదేంటి
కల్లు తాగితే చస్తున్నారు
ఓ పూట కల్లు తాగకున్నా చస్తున్నారు
సమయానికి కల్లు దొరక్క పిచ్చోళ్లి
ఉరేసుకొంటున్నారు
మరి ఇది కల్లెతే
మనకు తెలిసిందేమిటి
తాళ్లు ఉండవు గౌండ్లు ఉండరు
మోకు ముస్తాదు కత్తి కలాలు లేకుండా
బుస బుస పొంగుతూ లారీలోంచి
కాటన్ కాటన్లుగ సీసాలు దిగుతాయి
ఊళ్లలో తాళ్లన్ని బోసిపోయినప్పుడు కూడ
డిపోల్లో
సీసాలు బుస బుస పొంగుతాయి
సీజన్ అన్సీజన్ ఉండదు
ఒకే ధర ఒకే రుచి ఒకే నిషా
అది కల్లే
మనం నమ్మాల్సిందే మరి
ఎందుకంటే అది కల్లేనని
ప్రభుత్వం రాజముద్ర వేసింది
పసిపిల్లల నుండి పండు ముసలి వరకు
డిపోలకచ్చి తాగొచ్చని
లైసెన్సు ఇచ్చింది
తెలతెలవారుతుండగానే షురూ చేయొచ్చు
రాత్రి పొద్దు పోయేవరకు
డిపోల ముందు బాహాటంగానే తాగొచ్చు
అమ్మేవాడికి తాగేవాడికే కాదు
లైసెన్సు ఇచ్చేవాడికి కూడా
అది కల్లు కాదని తెల్సు
డైజోఫామో క్లోరోఫామో
పేరేదైతేనేమి
అది మనిషిని చంపే విషమని తెలుసు
రెండు చుక్కలు ఎక్కువైతే
అదే రోజు చస్తారు
మోతాదులో కలిపితే
నాలుగు రోజులాగి చస్తారు
చచ్చేవాడు చస్తూంటే
డిపోలు వేలం వేస్తూనే ఉంటారు
పోటీలు పడి వేలంపాటలు లక్షల్లో పలుకుతాయి
విషమని తెలిసి
లక్షల కోసం వేలం పాటలు నిర్వహిస్తూనే ఉంటారు
ఇది సంక్షేమ రాజ్యం మరి
ప్రజా సంక్షేమం కోసం
ప్రభుత్వానికి ఆదాయం కావాలి కదా
నీవు తినడానికి రూపాయి కిలో బియ్యం ఇవ్వాలి
ఉండటానికి రెండు పడక గదుల ఇల్లు ఇవ్వాలి
కాన్పు వస్తే కేసీఆర్ కిట్ ఇవ్వాలి
పిల్లలు చదువుకుంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి
పిల్ల పెళ్ళి చేస్తే కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి
రోగమొస్తే ఆరోగ్యశ్రీ ఇవ్వాలి
పిడాత చస్తే ‘ఆపద్బంధు’ ఇవ్వాలి
వయసు మీరితే వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలి
ఒకటేమిటి ?
కడుపుల పడ్డప్పటి నుండి
కాటికి చేరే వరకు
ఎన్నెన్ని పథకాలు అమలు చేయాలని!
అన్నన్ని పథకాలు అమలు చేయాలంటే
ప్రభుత్వానికి ఆదాయం కావాలిగా
ఇది సంక్షేమరాజ్యం
ప్రజల సంక్షేమం కోసం
ప్రభుత్వానికి ఆదాయం కావాలి
ఆదాయం కావాలంటే
మద్యం పాలసీ అమలు చేయాలి
తప్పదు
అది విషమని తెలిసినా
కల్లని అమ్మాల్సిందే!!
తెగువ
22 సెప్టెంబర్, 2017 (భారత వ్యూహాన్ని ఎదుర్కోవడానికే అణ్వస్త్రాలు - పాక్ ప్రధాని ప్రకటన చదవి)
ఎదుర్కొనుటకే అనుటకంటే
గురిపెట్టుటకే అనుట నిజం
ఎలా అంటే ఏమి లేండి… పాక్
అణ్వస్త్రాలు భారత్ కొరకే అని
ప్రపంచానికి పాక్ ప్రధాని
కరాఖండిగా చెప్పినాడు
ఉగ్రవాద స్థావరాలకు
పాక్ ఆయువు పట్టు అని
ఉత్తరకొరియా అణ్వస్త్రం
పాక్ చలువయే అని
సైనిక నియంత్రణ లోనే… పాక్
ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని
ప్రపంచానికేదో తెలియనట్లు
చిలుక పలుకులు పలికినాడు
పాక్ లోన అణ్వస్త్రాలు పూర్తి
ఆదేశిక నియంత్రణలో ఉన్నవని
ఫార్ములైనా అణుబాంబునైనా
డబ్బు అవసరమైనప్పుడు
దేశమా ఉగ్రవాదమూకనా అని
చూడకుండా
తెగనమ్మే తెగువ
పాక్ సైన్యానికి కలదని
ప్రపంచం
ఇప్పుడు గుర్తెరిగి మెలగాలి
నగరంలో చినుకు
20 అక్టోబర్, 2017 (ముంబయ్ వరదలపై)
చినుకు పడితే చాలు నగరవాసి
ప్రాణం అరచేతిలో పెట్టుకొని బ్రతకాలి
ముంబయి హైదరాబాద్ పేరేదైతేనేమీ
నీరింక భూముండదు
వరద పార వాగుండదు
వర్షం పడితే చాలు
రోడ్లు వాగుతై
కొంచెం ఎక్కువైతే
ఇళ్లు కొలనులో తేలే తామరలైతై
గుట్టలు అడవులు వాగులు డొంకలు చెరువులు
అన్ని ఉనికి కోల్పోయీ ఆకాశహర్మ్యాలైతే
నీరు తన తావును తాను వెతుక్కోక ఏంజేస్తది
నగరం వరదలు
మానవ స్వార్థానికి ఆనవాళ్లే కాదు
ప్రకృతిని ప్రకృతిగా ఉండనీయకుంటే
మానవ మనుగడకే ముప్పు అనుటకు కూడా సంకేతం!
లైసెన్స్ డ్ అత్యాచారం
21 సెప్టెంబర్, 2017
దారిద్ర్యం నిరక్షరాస్యత మతమౌఢ్యం పితృస్వామ్యం
కలగలిసి కన్నవార్ని కసాయిలుగా మారిస్తే
నిఖా పేర్న పసిమొగ్గలను అరబ్ షేకు అమ్మేస్తే
పసిప్రాయంపై జరిగేను
లైసెన్స్ అత్యాచారం
ఫోనులోనే నిఖాలంటా
ఫోనులోనే తలాలంటా
మోజు తీరి వదిలేసుడో
వ్యభిచారంలోకి దించుడో
జరిగిన మోసం తెలిసే వరకూ
జీవితాలు చేజారును
ఖాజీలు దళారులు కోటీశ్వరులగుదురు
తరతరాలుగా జరిగే
ఈ దురంతాలనాపలేని
చట్టాలు సంస్కరణోద్యమాలను
సంక్షేమరాజ్య ఫలితాలను
వెక్కి వెక్కి ఏడ్చే పాతబస్తీ పిల్లల
వెక్కిళ్లు వెక్కిరించే మనలను!
సెల్ఫీ
26 సెప్టెంబర్, 2017
సెల్ఫీ అనగానే చెలరేగి పోవు సాహసం
ఉన్న ఉనికినే మరచి ఉరకలెత్తు ఆనందం
షాటే షూటై ప్రాణం గాల్లోన కలిసిపాయే
మిగిల్చే ప్రాణాంతక సరదా
అయినవారి గుండెల్లో ఆరని జ్వాల
సంఘటనలు ఎన్ని జరిగినా
మారదాయే పాడు సరదా
ఉనికిని కూడా మరిచే కోపమైనా ఆనందమైనా
మనిషికి చేటు చేయునని
మితం జాగ్రత్తలు చాదస్తం కాదని
అవి జీవితపు ప్రతి అడుగునా
ఆవశ్యకమైన సూత్రాలని
అతుక్కునేలా చెప్పే పెద్దలెవ్వరున్నారు ?
ఆలకించి వినే వినయం యువతకేడవుంది?
తల్లిదండ్రులు ఉపాధ్యాయులు
ప్రభుత్వం ప్రబోధకులు సమాజీకులందరినీ
అలసత్వం అజాగ్రత్త మితిమీరినతనం
యువత ప్రవర్తన నుంచి దూరం చేసే
కార్యాచరణ ఒకటి ప్రారంభించవలచినదిగ
ప్రాధేయపడుతున్నాను!
సరళీకరణ ఫలితాలు
24 సెప్టెంబర్, 2017 (భారత్ లో విపరీతంగా పెరిగిన ఆదాయ అంతరాలు వార్తపై)
ఆర్థిక సంస్కరణలు ఎంత
అద్భుతమైన ఫలితమిచ్చే
ఫోర్బ్స్ జాబితా ఒక్కసారి
పరికించి చూడరయా
పోగుపడేను దేశసంపద సగం వరకు
ఒక శాతం సంపన్నుల వద్దనే
పేదలు కడు పేదలవ్వా
బిలియనీర్స్ పుట్టుకచ్చిరి
రోజు రోజుకు వారి జాబితా
కొండచిలువ లాగా పెరగబట్టే
వ్యవసాయం చిన్న పరిశ్రమలు
చిల్లర వరక్తం
కనిపించిన దానినల్లా
గుటకాయ స్వాహా అనిరి
పరిపాలన వారి కనుసన్నల
పెంపుడు చిలుకైపాయే
మార్కెట్ మాయాజాలంలో
ప్రతి ఒక్కరూ నల్గిపోయిరి
గుర్తెరిగి ఇప్పటికైనా సరళీకరణ పైన సమరం చేద్దాం!
బహుళ అనర్థకం
జులై, 2014
కాకుల్ని కొట్టి
గద్దలకు వేయడం
అభివృద్ధి అయితే
పోలవరం నిర్మాణం - అభివృద్ధే అవుతుంది
పక్కోన్ని నిలువునా ముంచి
మనోన్ని పైకి తేవాలనే అభివృద్ధి
ఏ రకమైన నాగరికత
ఒకటి కావాలంటే మరోటి వదులుకోవాలి!
అంటే దానర్ధం
ఒక్కడి భోగాల కోసం
మరోడు సర్వం కోల్పోవాలనా?
అభివృద్ధికి త్యాగాలు తప్పనిసరని తెలుసు
కానీ……
నమూనా మార్చి నష్టం తగ్గించండి అంటే…
మిమ్ము నిలువున ముంచడమే
మా అభిమతం అనడం…
ప్రజాస్వామ్యమా? ఫాసిజమా? ఏ రకమైన పాలన
ప్రత్యామ్నాయ ఆలోచనకు తావివ్వక పోవడం
ఆధిపత్య జాతనే అహంకార ధోరణినే
భద్రాచలం గోసిగాళ్లనే మాట నోటికీ
నాజీయిజం నరనరానా జీర్ణించకుండా ఎలా వచ్చింది?
అందరూ పౌరులే అయినప్పుడు
హక్కులు అవకాశాలు సమంగ ఉండవా?
దుడ్డున్న వాడిదే బర్రె
నోరున్నోడిదే ఊరు
అడిగేవాడే లేనప్పుడు
ఆడింది ఆట… పాడింది పాట
అండదండ.. అడిగే నోరు లేకుండా
ఆదివాసీలను తెలంగాణ నుండి
విడగొట్టేద్దాం
ఎంత రాక్షస రాజకీయం
బానిస సమాజంలో కూడా
ఇంత నీచపు మంత్రాంగం జరిగుండదేమో!?
ముంచేస్తావు సరే,
పునరావాసంలో కూడా
వాడి మనోభావాలకు తావుండకూడదా?
కలుపుకోవడమే ఇంత ఏకపక్షమైనకాడ
ఇక కలసి పోయినంక
వాడి మాటకేం ప్రాధాన్యముంటుంది?
ఆర్డినెన్సా దండయాత్రనా పేరేదైతేనేమీ
జరిగింది సామ్రాజ్య విస్తరణనే తలపిస్తుంది
జీ.ఓ ఏడువందల ఇరవైమూడు
రాజుల విజయస్తంభాన్ని గుర్తుకు తెస్తుంది
సాధారణ పౌరహక్కులు మంటగలిసినచోట
ఆదివాసీల ప్రత్యేక హక్కులు పేరాశే అవుతుంది
మూడవ పంట స్థిరీకరణ అలా ఉంచితే
కొత్తగా సాగులోకి వచ్చే ఒక్కో ఎకరానికి
ఒక ఆదివాసీని ముంచే ప్రాజెక్టుకు
జాతీయ సదా కల్పించడంతో
ఐదో షెడ్యూల్డ్ పరిహాసమైంది
పిసా అమలు ఎలా ఏడ్చిందో చెప్పడానికి
పోలవరం నిర్మాణం గొప్ప ఉదాహరణగ మారింది
కొండరెడ్లను ఇప్పటికే
కొండల మధ్యకు తరిమేశాం
ఇప్పుడు కొండల్ని కూడా ముంచేస్తే
కొండల పై అంచుకు చేరుతారు
చుట్టూ కమ్మిన నీటిలో చిటారు కొండల్లో
వారి చావు పుట్టుకలకు
బాహ్య ప్రపంచంతో సంబంధం తెగిపోతుంది
ఇది వారి జీవన స్థాయిని వెయ్యేళ్లు వెనక్కి పంపడమే!
పుట్టినగడ్డతో బొడ్డుతాడు తెంచుకొని
చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లాచెదురైతే
వారి ఉనికిని వారే మరిచే దుర్గతి
ఏతావాతా కొండరెడ్ల విశిష్ట సంస్కృతికి
దేశంలో కాలం చెల్లిపోయినట్లే!
వేల సంవత్సరాల పూర సంస్కృతి
జీవన వైవిధ్యం సమాధి అవుతుంది
పోలవరం ఎన్నో చారిత్రక ప్రదేశాలతో పాటు
సజీవ చరిత్రను ముంచేస్తుంది
నీరు పల్లమెరుగు - అది ప్రకృతి
పల్లంలో సంపద పెంచడానికి
నీరు మిట్టల్ని ముంచి ఎత్తిననాడు
ప్రకృతితో మమేకమైన బ్రతుకులు
చిన్నాభిన్నమై విచ్చిన్నమవుతాయి
అసలు ప్రకృతే విచ్ఛిన్నమైన నాడు
మనిషీ వాని మనుగడ ఏ మాత్రమని
గోదావరిలో కలసి కూడా
విడిగా పారే శబరి హెయలు
ఇక మనకు కనిపించవు
మన కథల్లోని పాపి రాక్షసుడి కంటే
బలమైన పాలకులు మనకు వచ్చేశారు
పాపిన శబరి పాయలను కలపడమే కాదు
అమాంతం పాపికొండల్నే మింగేస్తారు
శ్రీరామగిరి సుందర రామయ్య అందాలను చూసి
గోదావరి అలలపై తేలిపోతూ
పచ్చటి కొండల్లో ముచ్చట గొలిపే ఊళ్లను
తుమ్మిలేరు తుల్లింతలను పలకరిస్తూ
పేరంటంపల్లికి పేరంటాలు పోయి
పాపికొండల అందాలకు పరవశిస్తూ
అలా అలా అలలపై సాగి
కదులుతుందా లేదా అనిపిస్తూనే
గోదావరిలో కలిసే పాములేరు
మౌన అందాలను చూస్తూ
కొల్లూరు ఇసుక తిన్నెలపై భోజనాలు లాగించి
పచ్చటి కౌగిట సేద తీరటం
ఇక అమ్మమ్మ చెప్పే కథల్లోని ముచ్చటగుతుంది
పర్యావరణం, పర్యాటకం, అటవీ సంపదను
అరవై ఏళ్ల అభివృద్ధిని కోట్ల ఆస్తులను
మూడు వందల యాభై ఊళ్లను
మూడు లక్షల మందిని
గంగపాలు చేసేటప్పుడు
లాభనష్టాల బేరీజు ఉండదా?
మునిగే భూమెంత - కొత్తగా సాగులోకి వచ్చేదెంత
నిర్వాసితులెందరు లాభపడేదెందరు
అపార జలరాశి ఒకేచోట చేరుట వల్ల
కలిగే ఉత్పాతాల నష్టం ఎంత?
అనుకోకుండా ఏదైన అనర్థం జరిగితే
కలిగే భయానక ప్రళయ నష్టం ఎంత
ఎటు నుంచి ఎటు చూసినా
నష్టమే ఎక్కువగా కనిపిస్తుంటే
వేలకోట్లు వెచ్చించి ప్రాజెక్టు
ఎవ్వరి కోసం నిర్మితమవుతుందో
లోకానికి తేటతెల్లమైంది
పాలకులారా ! చరిత్ర క్షమించాలంటే
ఇప్పటికైనా ప్రత్యామ్నాయం వైపు
ఆలోచన సాగించండి !!
వేగుచుక్క
సెప్టెంబర్, 2017
చలక చేను చెట్టు చేమ
గొడ్డు గోద కోడి మేక
ఇల్లు ఇల్లాలు పిల్లలు
తాను తన నైపుణ్యం
దొర అవసరం అధికారం హక్కుకు లోనై ఉన్నప్పుడు
పోరాడితే పోయేది ఏముంది
బానిస సంకెళ్లు తప్ప
మార్క్సిజం చదవకుండానే
తెలంగాణ ప్రజలకు జీవితం నేర్పిన పాఠమది
అందుకే బాంచను దొర అన్నవారు
బందూక్ గురి పెట్టారు
ముందు వెనుక చూడకుండా
పోరాటంలో దూకినారు
పోరాటం ఆవశ్యం అయినప్పుడు
అందిన ప్రతి వస్తువు ఆయుధమే అవుతుంది
వడిసెల రోకలి కత్తిపీట కారంపొడి
అన్నీ తెలంగాణ పోరాటంలో ఆయుధాలే
బరిగీసి పోరులోకి దూకినాక
ప్రతి వ్యక్తి సైనికుడే
స్త్రీయా పురుషుడా పిల్లలా వృద్ధులా
ఎవ్వరైనా వీరులే
ఎవ్వరి పోరాట రూపం వారికుంది
కల్లులో విషం కలిపి సైనికులను హతమార్చిన
బాలలసంఘాలను
తెలంగాణ పోరాటం మనకు చూపిస్తుంది
ఉపాయాలతో సైనికుల బురిడీ కొట్టించిన
ఊదర బాంబుల సృజనకు ఊహ అందించిన
ముసలవ్వలను
తెలంగాణ పోరాటం మనకు చూపిస్తుంది
అందుకే తెలంగాణ పోరాటం
ప్రపంచ చరిత్రలోనే ప్రత్యేకం
అనంత త్యాగాలే కాదు అద్భుత విజయాలతో
ఇప్పటికీ మన గుండెల్లో మంటలా మండుతూ
మనం చేయాల్సిన పోరాటానికి దారులు చూపుతుంది
యజ్ఞ పురుషుడు
అక్టోబర్, 1998 (1998లో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్రామ అభివృద్ధి అధికారుల సంఘం రజత్సోవం సందర్భంగా శ్రీ ఎస్. విఠల్ రెడ్డిగారు పైన పేర్కొన్న జీఓలు రావటానికి చేసిన కృషికి ఈ కవిత అంకితం)
లాభాలు తప్ప పునర్నిర్మాణం పట్టని
వలస పాలనలో భారతం బడుగు దేశమైన్నాడు
స్వతంత్ర భారతి ఆరంభించిన
పునర్నిర్మాణ మహాయజ్ఞంలో
దేశానికి యజ్ఞఫలాలను అందించ
నీవు యజ్ఞపురుషుడవై పుట్టావు
కళకళలాడే గ్రామాలు
చేతులు నరికిన మొండాలైన్నాడు
కమ్యూనిటీ అభివృద్ధి కార్యాచరణలో
నీవు కారకమై ఉత్ప్రేరకమై
కార్యాకారణ సంబంధమైనావు
అందరూ నీపై అధికారులే
విస్తరణ గురించి ఉపన్యాసాలిచ్చేవారే
కాని, భారతావని మూలమూల గ్రామాల్లో
విస్తరించింది నీవొక్కడివే!
వ్యవసాయ అభివృద్ధే గ్రామాభివృద్ధి
గ్రామాభివృద్దే దేశాభివృద్ధి అన్ననాడు
నీవు రైతుకు బడిపంతులైనావు
ప్రయోగశాలను పంటపొలాల్లో
ప్రతిఫలింప చేయుటకై - నీవు
పరివాహకుడివై - పరివ్రాజకుడివై
పేరులేని తండాలకు రికార్డుల్లో లేని గ్రామాలకు
బురదలో, బడుగుల్లో, లోయల్లో, లొద్దుల్లో
గుట్టలు ఎక్కి వాగులు ఈది
అరణ్యాల్లో దారులు వెతుక్కుంటూ
ఒంటరిగా నీ వొక్కడివే
ఎలా వెళ్ళావో నేడెవ్వరికి తెలుసు
నీవు! నాగటివై నాగటి చాలువై
మొలకెత్తే విత్తనమై పెరిగే పైరువై
జారవిడిచిన కంకివై నూర్పువై
అధునాత వ్యవసాయపు ఆనవాలువై
హరిత విప్లవాన్ని సాధించావు
అనుబంధ పరిశ్రమలే
రైతుకు అండదండలన్ననాడు
నీవు పశుపాలక గురువైనావు
మేలు జాతి కోళ్ళను
బహుళ ప్రయోజన గొట్టెలను
పల్లెలకు పరిచయం చేసావు
అధిక పాలనిచ్చు ఆవుల గురించి
ముర్రా జాతి గేదల గురించి
పచ్చిమేత ప్రాధాన్యత గురించి
ప్రతి రైతూ గుండె తలుపు తట్టి చెప్పావు
ఆరోగ్యంతో గెంతులేసే
లేగదూడలోని ఆనందానివై
పాలధార నురుగువై
శ్వేత విప్లవంలో భాగమైనావు
నీవొక్కడవై అన్నీ నీవై
ఎన్నెన్ని సాధించావో!
యువజన సంఘాలు స్థాపించి
సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పి
పల్లెలను జాగృతం చేసిన్నాడు
నీవొక సాంఘిక కార్యకర్తవైనావు
ఋణ వనరుల గురించి
మార్కెట్ సౌకర్యాల గురించి
కొత్త పనిముట్ల గురించి
పనిలో యంత్రం పాత్ర గురించి
ప్రజలకు తెలియ చెప్పిన్నాడు
నీవొక ఆర్థికవేత్తవైనావు
గృహనిర్మాణం గానీ
కుటుంబ నియంత్రణగానీ
సంపూర్ణ అక్షరాస్యతగానీ
ప్రభుత్వ ప్రతి పథకాన్ని
గ్రామాలకు చేర్చే మాధ్యమమైనావు
ఎస్ఎడిసి, ఎంఎఫ్ డిసి, డిఆర్‌డీఏ, ఐటీడీఏ
ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషను
పేరేదైనా కాని,
నీ ప్రమేయం లేకుండా ఏ ఏజెన్సీ కూడా
గ్రామాల్లో అడుగిడింది లేదు
కమ్యూనిటీ డెవలప్మెంట్ నుండి
జన్మభూమి వరకూ గ్రామాల్లో
ప్రభుత్వానికి పెద్ద దిక్కై నిలిచావు
గ్రామీణాభివృద్ధి అణువణువులో
స్పందనవై ప్రతిస్పందనవై
పరిశ్రమించావు
ఇంతా చేస్తే
వ్యవసాయ శాఖ నీవు తనవాడివే కాదంది
పశుసంవర్థక శాఖ నీ గురించి పల్లెత్తి మాట్లాడలేదు
జీవిత కాలానికి చేసిన కృషి
కరివేపాకు చందంగా ఏరివేయబడింది
రసం పిండిన కాండానివై
మండల వ్యవస్థలో నీవు మిగిలావు
గోదాము కీపర్లూ రికార్డు అసిస్టెంట్లూ
ఎంపీడీఓలుగా వస్తుంటే
వీడీఓ, వీడీఓగానే ఉద్యోగ విరమణ చేస్తాడనే
మాటలని వేదాంతిలా వింటూ
చెప్పిన పని చేసే కర్మయోగిలా మారావు
ఎటు చూసినా నిరాశా నిస్పృహలు
కారుచీకట్లు కదిలాడే వేళా
ఆటుపోట్లతో సాగిన
పాతికేళ్ళ పోరాటంలో
చిరు క్రాంతి రేఖై నూటా డెబ్బై రెండు జీఓ వచ్చింది
వీడీఓలు కూడా హక్కులు సాధించుకుంటున్నారే
అని ఉద్యోగలోకం తలెత్తి చూస్తున్నవేళ
పథ నిర్దేశంలో వేగాన్ని పెంచుతూ
నూటా డెబ్బై జీఓ వచ్చింది
నేడు నీవు కూడా పదోన్నతి పరుగులో
అందరితో సమంగా బరిలోకి దిగావు
కర్మయోగిలా పని చేయటమే కాదు
వీర సైనికునిలా పోరాడ్డం తెల్సని చాటావు
ఇప్పుడు వీడీఓలు యంపీడీఓలుగానే కాదు
సీఈవో పదోన్నతి పరుగులో ఉన్నారు
అడ్డంకులెన్నైనా రానీ అన్నీ తాత్కాలికమే
పోరాటంలో వెనుకంజ వేసే ప్రసక్తి రానీకు
కాలంతో మారుదాం
సెప్టెంబర్, 2017 (మాకొద్దీ చదువులు వార్త చదివి)
ఏటికేడు పీజీ సీట్లు
ఖాళీ గుండుటెక్కువాయే
చేరిన వారైన క్లాసులకు సరిగా రాక
ఉపాధి ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు
అది తెలసి మన ప్రభుత
బయోమెట్రిక్ పెట్టెను
నిర్బంధపు హాజరు విద్యా
ప్రమాణాలు పెంచేనా
ఉద్యోగమే ముఖ్యమని
ఉన్న చదువు మాన్పించేనా
రీయింబర్స్మెంట్ కై నడిచే
కాలేజీల ప్రక్కన పెట్టు
ప్రభుత్వ సంస్థలలో నిండిన
పీజీ సీట్లు ఎన్నో చూడు
ముప్పై ఏళ్లు పట్టాలకై పరుగులెట్టి
ఆ పై తీరిగ్గా ఉద్యోగ ప్రకటనలు చూస్తూ
గడ్డాలు పెంచుకునే రోజులెల్లి
పోయినాయి
మారుతున్న కాలంలో మారని
మూస విద్యా విధానం కారణమని
తెలుసుకొని సంస్కరణలు తేవాలి
ప్రపంచంలో పలు దేశాలలో
ఉద్యోగిస్తూ చదువుకునే
విద్యా విధానం కలదు
అన్నింటికీ పాశ్చాత్య దేశాల వైపు చూసే
మన పాలకులు
విద్యా విధానం విషయంలో
అసలు చూడరెందుకో
ఉద్యోగిస్తూ చదువుకునే విద్యా
విధానం రూపొందించుటకై
ఉద్యమించాలి యువత విద్యార్థి లోకం!
మతలబ్ !
సెప్టెంబర్, 2011
దోసుకోవడం నిజం కానప్పుడు
విడిపోదామంటే ఎందుకు వద్దంటావు
అన్నదమ్ములు కలిసుండటం ఆదర్శమే కావచ్చు !
కుదరనప్పుడు విడిపోవడం కూడా సహజమే!
ఇంత దానికి జరుగరాందేదో జరిగినట్లు
నీవు అంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు?
దోచుకోవడం నిజం కానప్పుడు
దోచుకోవడమే నిజం కానప్పుడు
నా బతుకు నే బతుకుతానంటే
ఎవ్వని హద్దులు వానికున్నప్పుడు
నీకేం బాధో నాకర్థం కాదు
తరాల ముందు చారిత్రక గమనంలో
ఎట్లనో ఎప్పుడో విడిపోయినం
ఎవ్వడి బతుకు వాడు బతికినం
హద్దులు వేరైనాయి అంతరంగాలు వేరైనాయి
ఎవ్వడి చరిత్ర వాడికి ఏర్పడింది
అలమినో బలిమినో కష్టంగానో ఇష్టంగానో
కాలచక్రంలో మళ్ళీ కలిసినం
కానీ…
హద్దులు మారలే అంతరంగాలు కలువలే
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు
నీవు ఒక్క మెట్టు పైనే ఉన్నట్లు ప్రవర్తించావు
కలసిన మరు రోజు నుండే
నీకు నాకు పొత్తు పొసగదని తెలిసి పోయింది
ఆ క్షణం నుంచే
ఎవ్వడి బతుకు వాడు బతుకుదామంటున్నాను
కల్సిండాల్సిందేనని నీవు జులుం చేస్తూనే ఉన్నావు
కల్సిండటమంటే నీకు గుంజుకోవడం
కల్సిండటమంటే నీకు పెత్తనం చెలాయించడం
అందుకే అధికారం అండగా
కుట్రలు కుతంత్రాలు కుటిల రాజకీయంతో
అప్పుడు ఇప్పుడు ఎప్పుడు జబర్దస్తి చేస్తూనే ఉన్నావు
కలిసుండట మనేది
ఇద్దరి ఇష్టంతో కదా జరగాలి ?
మరి నీ జులుం జబర్దస్తి ఏమిటి?
జులుం జబర్దస్తితో ఉండే పొత్తును
కల్సిండటమంటారా? లొంగుండటమంటరా ?
ఈ ప్రశ్న నీతోపాటు
ఈ దేశాన్ని ఈ లోకాన్ని అడుగుతున్నాను
ఇద్దరి ఇష్టాలతో సంబంధం లేకుండ
ఒక్కరి జులుం జబర్తస్తితో పొత్తుండటాన్ని
కల్సుండటమంటారా? లొంగుండటమంటరా?
ఈ ప్రశ్న నీతోపాటు
ఈ దేశాన్ని ఈ లోకాన్ని
మళ్లీ మళ్లీ అడుగుతున్నాను!
నిన్నటికి నేటికి తేడా లేనప్పుడు
ఉగాది, 2008
నేడు రోజు లాగే తెల్లవారింది
నిన్నటి బాధల మోపు బరువుతో తూలే గాలిలో
కోకిల పాటలు; పూలవాసనల జాడలేదు
పచ్చదనాలు పలకరింతలూ లేవు
మొదళ్లు కూలుతుంటే చిగురేంటి
చిగుళ్లకూ ముఖం వాసినోడికి
పచ్చదనమేంటీ, పూలవాసన లేంటి
పెనం మీది బ్రతుకు పొయ్యిల పడ్డాక
వసంతమైతేంటి గ్రీష్మమైతేంటి ?
అసలు ఏడాదంత బోణీలేనోడికి ఉగాదేంటి ?
క్షవరం తిరుక్షవసరమై మెన్స్ బ్యూటీపార్లరైంది
ఏ కత్తికి కంకణం కట్టను?
సుత్తే కారు ఉలి బాడిసే
బిళ్లలు సాగదీసిన సమ్మెట
తీగెలు లాగిన కమ్మోచ్చులు
ప్రెసింగ్ మిషన్లో ప్లాటై
ఫైనింగ్ మిషన్లో స్మూత్ అయినాయి
నదరు నగిషీ నైపుణ్యాలన్ని
రోటరీ మిషన్ లో రొటేటు అవుతున్నాయి
ఏ పనిమట్టు ఏ మ్యూజియంలో ఉందో
జ్ఞాపకాలను ఎగదోసుకుందామంటే
సటీకం పారేసుకున్నాను
మర్రి ఆకుల విస్తట్లో వేటికి పసుపు రాసి పూదిద్దును ?
అయినా ఏడాదంతా బోణిలేనోడికి ఉగాదేంటి ?
తెల్లగోగు ఏ నిఘంటువులో దాక్కుందో
నారలేదు పగ్గం పురెట్లెయ్యాలి ?
బోదెలకాని, బారెడుజోళ్లు కనపడతలేవు
ఎద్దులు ఏ ఆల్ కబీరులో ఉన్నాయో ?
అయినా ఏడాదంత సాలు పెట్టనోడికి
కొత్త సాలు ఏంటీ
సారే పాయే ఆరే పాయే!
నేనిప్పుడు శిల్పారామంలో బొమ్మనై కూర్చున్నా
పరచుకుంటున్న ప్రపంచీకరణ
నన్ను పూడ్చివేస్తూ కదులుతుంటే
కొండలా పోగవుతున్న కొత్త సంపదలకు
విలాసాన్ని, వినోదాన్ని పంచుటకు
నన్ను బొమ్మై కూర్చొమ్మంది సరళీకరణ
ఇక కొత్త సాలేంది పాత సాలేంది ?
పని నేర్చిన చేతులకు ప్రత్యామ్నాయం కనిపించక
ఆకలి చావులో! ఆత్మహత్యలో!
చరిత్ర రాసుకుంటున్నోళ్లకు
పండుగేంది పబ్బమేంది!
ధరలపై గురుత్వాకర్షణ పని చేయదు
ఏప్రిల్, 2009
తొలి వెలుగు రేఖలు విచ్చుకున్న
సవ్వడిని మోసుకుంటూ వీచే ఉదయ సమీరం
చల్లచల్లగ మేనిని స్పర్శించించువేళ
ఎవ్వరో గుండె కవాటాలు నొక్కిన బాధేసింది
పేస్టు ట్యూబ్ నొక్కినంతనే!
ఎనిమిది, పదహారు, ముప్పైరెండు ఒక ఏడాదిలో
ఎన్ని రెట్లు పెరిగింది పేస్టు ధర
ఏమోలే! అంటూ స్నానానికి వెళ్ళాను
ఉల్లిపూల గుత్తుల్లా తెల్ల తెల్లగా
ఒంటిపై తేలియాడు సబ్బునురగ
అరిగే సబ్బును గుర్తు చేస్తూ
తాజాదనపు అనుభూతిని అవిరి చేసింది
కప్పు చేతబట్టగానే
లలిత కాఠిన్యపు మంద్ర సువాసనలు
వెదజల్లవలసిన చాయ్
పది, ఇరవై, ముప్పై అంటు ఏడాదిలో పెరిగిన
వంద గ్రాములు టీ ధరను గుర్తుచేస్తుంది
ఏంటో కంచం ముందు కూర్చుంటే
బియ్యం ధరే గుర్తుకు వస్తుంది
కూరలేవీ కూడ వాటి సహజ రుచిని
కల్గి ఉన్నట్లు అనిపించుట లేదు
జిహ్వనాడిని సవాల్ చేస్తూ
కూరగాయల ధరలు మెదట్లో గిరికీలు కొడుతున్నాయి
ఏం తినేటట్లు లేదు - ఏదీ కొనేటట్లు లేదు
నాగులో నాగన్న - ధరలిట్లా మండిపాయే!
చిన్నప్పుడు విన్న పాట పాడాలనిపిస్తుంది
అవునూ ! ధరలెందుకు ఆకాశన్నంటాయి
అమెరికాలో ఆర్థిక మాంధ్యమంటా !
అమెరికాలో ఆర్థికమాంధ్యమైతే
ప్రక్క ఊళ్లో పండే పాలకూర ధర పెరుగుతుందా !
అంతా బాదరాయణ సంబంధం
గ్లోబలైజేషన్ అంటే ఇదే కాబోలు
ఫలితాలు ఎంత గొప్పగా ఉన్నాయో!
అనుభవించు రాజా !
అయినా
భారత్ పై ఆర్థిక మాంధ్య ప్రభావం అంతగా లేదన్నారే
ఏదో కొద్దిగ… ద్రవ్యోల్బణము వల్ల ధరలు పెరిగాయంటా
ద్రవ్యోల్బణం సున్నా స్థాయికి చేరిందన్నారే!
మరి ధరలు దిగి రావేంటి ?
ధరలపై గురుత్వాకర్షణ పనిచేయదు
అవి ఒక్కసారి పైకెగిరితే ఇంకా పైకెళ్లుతాయి
లేదా అక్కడైన స్థిరపడుతాయి
ఏలిన వారేమన్నా దించే ప్రయత్నం చేయరా
కష్టం ….
సామాన్యుల కంటే వ్యాపారులే వారికి దగ్గర!
పురి
జులై, 1987
నా పేదరికాన్ని ఒంటి మీదేసుకొని
ఈ దేశపు వీధుల్లో ఆగంగా తిరగిననాడు
నా నిరుద్యోగాన్ని కళ్లలో కుక్కుకొని
ఆఫీసులు ఆకాశం తేరిపార చూచినప్పుడు
నా బాధలు నా గుండెలను పిండేసి
నా కండలను నిస్సత్తువ చేసిననాడు
నా నాడులు స్పర్శను కోల్పోయి ప్రతిస్పందన మానిననాడు
నా ఒంటరితనాన్ని భయంకర కలలుగ
కలవరించిన రాత్రులు
ఈ ప్రపంచం ఎదురుగ ముఖమెత్తి
మౌనంగ ఎన్నిసార్లు ఆక్రందించానో
పంటికింద పెదవి నొక్కిపెట్టి
కళ్లలోని ఎంత నీరు గుండెల్లోకి ఇంకించేసానో
నా ఒంట్లో రక్తమంత కన్నీళ్లతో కలిసిపోయింది
నా ఏ అణువును తాకిన గత బాధలనే తెలుపుతుంది
నా గతాన్ని ఎంత త్రవ్వినా మట్టి పెంకలే
అవి మృణ్మయ పాత్రలు అనలేని అనాకారివి
నా కళా హృదయాన్ని మాడ్చి మసి చేసుకొన్నాను
నా ఆశయాలకు పిరమిడ్స్ కట్టుకొన్నాను
నా బాధలను ఎలుగెత్తాలని ఎన్నోసార్లు అనుకున్నాను
గుండె వేగం హెచ్చి గొంతు పెగిలేది కాదు
అయినా ఏ బాధలని ఏకరువు పెట్టగలను?
ఒకటా… రెండా.. ఒక్క పూటన - ఒక్క రోజున…
తరతరాలుగ నన్ను అణగదొక్కి
నాకు ఆకలి మిగిల్చి
దోపిడీ గానుగలో
నా తండ్రిని పిప్పిచేసి… తల్లిని రోగిష్టి చేసి
అన్నను ఆకలిచావు చంపి… చెల్లికి ఉరిపోసి
నన్ను నా వారిని బలితీసుకొన్న బాధలు
నా బ్రతుకు నుండి నన్ను వెలివేసి
నా నొసట వృత్తులాకారంగ గిరికీలు కొడూ
నా కళ్లల్లో సముద్రతరంగాల్లా కదలాడే బాధలు
స్థబ్దంగా కూర్చోని చీకట్లోకి చూస్తున్న నాపై
తైతక్కలాడుతూ సంతోషిస్తున్న
ఆ బాధలకు తెలియదు వాట్ని గావుపట్టడానికి
నా పళ్లు గరగరలాడుతున్నవని
గోళ్ళు కొరకడం నేల పొట్లించడం నుండి
నా కళ్లు శూన్యంలోకి పారేసుకోవడం నుండి
నే విముక్తి సాధిస్తున్నానని…
పిడికిళ్లు బిగుసుకొంటున్నాయి
కాళ్లు బలంగా ఆనుతున్నాయి
కలలు నిజం చేసుకోవడం కోసం
రేపటికి నన్ను నేను
ఆయుధంగా మలుచుకొంటున్నాను !
ఎవరికి చెందితే వారికి
జులై, 1987
కలం కాగితాలు ముందేసుకొని
నేను కవిత్వం రాయడానికి పూనుకొంటాను
వాడు నడుం వంగంగ శ్రమిస్తూ
తరతరాల దోపిడీని తెలిపే పొలాల్లోని
మట్టిలోనే పుట్టి మట్టిలో కలిసిపోతుంటాడు
నేను నా కట్టె కుర్చీపై కాళ్లు ఆనుకొని కూర్చుని
కవిత్వం రాయాలని చూస్తాను
యంత్రాల్లో యంత్రంగ… ఖనిజాల్లో ఖనిజంగా
వాడు కండలు చెమటగ పారిస్తూనే ఉంటాడు
కవిత్వం రాయడానికి నాల్గు గోడల మధ్య నేను
కలం కాగితాలతో కుస్తీ పడుతాను
వాడు వాని ఆకలి డొక్కల్ని వేలాడేసుకొని
బజా పడుతాడు
న్యాయం కోసం అడిగి అన్యాయానికి బలైతాడు
నేను నా కవిత్వాన్ని బహిట్లోకి ఘుమాయిస్తాను
అస్పష్టపు ముసుగుల్లో అంతరంగాన్ని దాచుకొంటాను
సమాసాల అతుకుల్లో కవిత్వం చూపాలనుకొంటాను
వాడు చేతులెత్తి తన్ను గుర్తించమంటాడు
పిడికిలెత్తి పోరాటానికి కలిసి రమ్మంటాడు
ఎవ్వరో కలం లేకనే కవిత్వం అల్లుతారు
ఎవ్వరో తంబుర లేకనే పాటలు పాడుతారు
ఆ గీతం, గానం ప్రజల బ్రతుకుల్లో భాగమవుతాయి
వాళ్లు ప్రజల గొంతుకలను స్వీకరిస్తారు
ప్రజల ఆశలకు ఆశయాలకు ప్రతిధ్వనులవుతారు
నేను నా కవిత్వపు కసరత్తు సాగిస్తూనే వుంటాను
నా శిల్పం సమాజ ప్రతిధ్వనిగ భ్రమింపచేస్తుంది
నాక్కావలసిన ప్రతిష్టను ఫలింపచేస్తుంది
నాకు నేను ప్రపక్షపాతిగా ముద్రేసుకొంటాను
మహాకవిగ ప్రశంసలు పొందుతాను
వాడు నడిబజార్లో న్యాయం కోసం
గొంతు చించుకుంటూనే ఉంటాడు
వాడి గొంతులో ఎవరో కొత్త పాటలు వినిపిస్తారు
వాడి గొంతులో ఎవ్వరో కొత్త శ్రుతులు పలికిస్తారు
నేను నా నాల్గు గోడల మధ్యలో
కట్టెకుర్చీపై కూర్చుని కవిత్వం రాస్తూనే ఉంటాను
ప్రజల మనిషిగ మహాకవిగ
పేరు గడిస్తూనే ఉంటాను
చరిత్ర రేపు
నిజానిజాల్ని వడగట్టుతుంది!
మానవజాతి మనుగడకే ముప్పు వాటిల్లిన వేళ
ఆగస్టు, 1987*
అణుబాంబు మొనల మీద పరుపులేసుకొని
ప్రపంచ శాంతి శిఖరాగ్ర చర్చలు జరుపుతాం
ఆకాశంలో క్షిపణులుంచి
పావురాన్ని ఎగురవేస్తాము
శాంతికి బాంబులు కాపలా ఉంచుతాం
ధైర్యం గుండెల్లో కాక బాంబుల్లో నింపుకుంటాం
ఈ ప్రపంచం సమతుల్య సిద్ధాంతాన్ని
బాంబులో పాటిస్తుంది
ఈ భూమ్మీద గూండాగిరికి
బెదిరింపులకు తప్ప రాజ్యం లేదు
ఇక్కడ గద్దలు
చిలుకలకు అహింసా పాఠాలు చెప్పుతాయి
గువ్వలకు సహజీవనం గూర్చి బోధిస్తాయి
బలం ఉన్న వాడిదే రాజ్యం అనేది
రాజనీతి నుండి పోయినా, ఆచరణలో పోలేదు
వ్యక్తిగత ఆధిపత్యంకై కుమ్ములాడినన్నాళ్ళు
యుద్ధ మేఘాలు కమ్ముతునే ఉంటాయి
మానవజాతి పైన ప్రేమ పెంచుకొంటేనే
శాంతి సహజీవనాలు సాధ్యం !
కొడిగట్టిన దీపము
ఆగస్టు, 1987
నా దేశం పోగొట్టుకున్న ప్రగతిని
ఆకలి కళ్లతో మురికి కాలువల్లో
జల్లెడ బట్టుకొంటాను
నా దేశం నింపుకొన్న ఆకలిని
చెత్త కుండీల్లోని విస్తారాకుల్లో
నాడీమండలం కోల్పోయిన నాలుకతో రుచి చూస్తాను
నా కండలు కరిగించి నీరుగా పారించి
నా రక్తం ఎరువుగ జల్లి
నా బ్రతుకు బలిచ్చి పండించిన పంట
ఏ కాకులో గద్దలో తన్నుకుపోతాయి
పస్తులు నాకు మిగులుతాయి
రక్తం మరుగుతుంటే తల పగిలిపోతుంటే
కండలు ఇగిరిపోతుంటే చేసే శ్రమకు
ఫలితం ఇది చాలదంటు వీధిలో పడ్డనాడు
యజమాని ఫ్యాక్టరీని లాకౌట్ చేస్తే
పస్తులతో ఈ కథను ఈడ్చుకొస్తాను
ఆకో అలమో తింటూ రేపుపై ఆశ నిలుపుతాను
ఆఖరికి ఆకలి చావుల్లో చరిత్ర రాసుకుంటాను
ఆ చరిత్రను తవ్వి కుప్పలు పోసుకొని
కొందరు క్యాష్ చేసుకొంటారు
నా గుండెను నేనే పెరుక్కుని
అడ్డుకోత కోసి భూతద్దంలో చూశాను
అక్కడంతా చీకటి, పొగచూరిన నలుపు
ఎక్కడో అడుగున నిప్పు వాసన వేస్తుంది
రాజుకొంటున్న మంటపై బురద చల్లిన ఆనవాళ్లు
ఒకప్రక్క బొగై ఒకప్రక్క బూడిదైన నెగళ్లు
ఎక్కడో జ్ఞాపకాల పొరల్లో పిచ్చి ఆరాటం
ఇదంతా చూసి నేను నిరాశతో ముడుచుకుపోతే
కులమతాల ప్లేగ్రౌండ్స్ లో నాయకులు
నాతో బంతులాడుకొంటారు
నా దేశంలో
తోడేళ్లు కూడా సామ్యవాదాన్నే వల్లిస్తాయి
ప్రతిపక్షాలెప్పుడూ ప్రక్కవాడి బురద చూపి
గద్దె లాక్కోవాలనుకుంటాయి
కమ్యూనిష్టులు పాలిపగలతో కొట్లాడుకుంటారు
నా దేశంలో
రాజకీయమంటే కుట్రలు ఎత్తుగడలు
పార్టీలంటే కొందరు వ్యక్తుల స్వంత ఆస్తులు
ఎన్నికలంటే ఒక్కనాటి తప్పుకు ఐదేళ్ల శిక్ష
ప్రజాస్వామ్యమంటే వ్యక్తి ఆరాధన, వారసత్వ పాలన
అంగడి బేరాల్లోనే కాదు దళారీల కమీషన్లు
కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల్లోనూ ఉంటాయి
మన అవినీతిని
జర్మన్ సబ్ మెరెన్లు సముద్రాలు దాటిస్తే
బోఫోర్స్ హిమాలయాలపై జెండా పాతింది
ఇక్కడందరు సన్యాసులే !
ఎవ్వడినెవ్వడు రాసుకొన్నా బూడిదే రాలుతుంది
ఎవ్వడి కష్టాల కుంపట్లో వాడే కాలుతుంటాడు
ఓర్మి భారతీయుడి సాంస్కృతిక హక్కు
ఒకపక్క ఇల్లు దోస్తున్నా పోనిద్దు అనే నిర్లిప్తత
తనపై సవారి చేసే వాన్ని
తనకంటే గొప్పోడనుకునే దరిద్రపు వారసత్వాన్ని
కర్మ సిద్ధాంతం రక్తంలో రంగరించింది
ఇవే వాన్ని తరతరాలుగ పరతంత్రున్ని చేసాయి
ఇప్పటికి వాని ప్రతిస్పందనను నిర్వీర్యం చేస్తున్నాయి
అందుకే
తరతరాల నైరాశ్యాన్ని కూకటివేళ్లతో పెళ్లగించి
రేపటి కోసం పోరాడే తత్వాన్ని
నరనరాన నింపే కొత్త టానిక్ నాక్కావాలి!
కొత్త సిలబస్
జులై, 2009
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
నీవు మరొకర్ని చూడకుండా
నీ కళ్లు పొడిచేసే అంతగా!
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
నీ ముఖము మరొకరు చూడకుండా
ఆసిడ్ పోసి కాల్చేసే అంతగా!
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
నీతో ఎవ్వడైనా మాట్లాడితే
వాన్ని చంపేసే అంతగా !
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
నీ తల్లిదండ్రులు కాదు కూడదు అంటే
వాళ్ళను చంపేసే అంతగా !
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
అడ్డు వస్తే నీ అన్న తమ్ములను చంపేసి
నిన్ను ఎత్తుకచ్చే అంతగా !
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
కసితో నీ అంగాంగము కొరికేసి
నలిపేసి నిన్ను రేప్ చేసే అంతగా !
నేను నిన్ను ప్రేమిస్తున్నాను
ఎంతగా అంటే
నీవు అంగీకరించకుంటే
ఒకే వేటులో నీ తల నరికేసే అంతగా !
ప్రేమకు
సిలబస్ మారింది!!