బరితెగించిన అభివృద్ధి
మంచిదే యాదగిరిని అభివృద్ధి చేద్దాంరద్దీ పెరుగుతే వ్యాపారం పెరుగుతుందిపసిమొగ్గలను చిదిమేస్తు వాళ్లు..
మంచిదే యాదగిరిని అభివృద్ధి చేద్దాం
రద్దీ పెరుగుతే వ్యాపారం పెరుగుతుంది
పసిమొగ్గలను చిదిమేస్తు వాళ్లు
లక్షలు సంపాదించు కొవాలి కాదా
ఇప్పుడు యాదగిరి అభివృద్ధికి నమునా
అక్కడి భూములు భూమి పుత్రుల చేజారి
ఎన్ని చేతులు మారయో!
తల్లి కొంగు వీడిన చిట్టి తల్లులు
ఎన్ని చేతులు మారారో
చేతులు మారినప్పుడల్లా
బ్రోకర్ల జేబులు నిండుతాయి
ధరణి తరుణి ఏదైనా ఇప్పుడక్కడ
తార్చడమే వ్యాపారం
పైసా మే పరమాత్మ ధనమే దైవం
దేవుడన్న జాతరన్న జరిగేది వ్యాపారమే కాదా
ఇప్పుడు మనకు అభివృద్ధి అన్న వ్యాపారమే
ఎవ్వడి వ్యాపారం వాన్ది
కోట్లు కుమ్మురించి యాదగిరిని అభివృద్ధి చేద్దాం
పునరావాసం తక్షణ చర్యలు మానవీయత
ఇవ్వన్నీ చరిత్రలో నిలిచే ముచ్చట్లా
మన చరిత్ర శిలాక్షరమై నిలవాలంటే
భవిష్యత్తు తరాలకు పాటగ వినిపించాలంటే
అద్భుత శిల్పాలు సుందర ఆలయాల
నిర్మాణలకంటే మించిన పని ఏముంటుంది
చరిత్రను ఒక్కసారి పరికించండి
రాజుల సొమ్ము రాళ్ళ పాలు
అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా
సొమ్ము ఏలికలది కాదు అది మనది
అని మనకు సోయి రానంత వరకూ
మనమిప్పుడు
శిల్పాల సొగసు లను గానం చేద్దాం
రోమ్ కాలిపొనీ ఫిడేలు వాయించేద్దాం
కళా పోషణ ముఖ్యం-మరీ
ఇహం దేముంది పరం ముఖ్యం
పారమార్థిక సేవలో పులకించి పోదాం
యాదగిరి ఆ పేరంటేనే తెలంగాణ ఐకాన్
కానీప్పుడు అది యాదాద్రి అయింది
యాదాద్రి అంటే తెలంగాణ యాస కాదు
చిన్న జీయర్ స్వామి వేషం కనిపిస్తుంది
హోటళ్ళు రిసార్ట్స్ ఏవేవో హంగామలతో
పరాయిదైనట్లు అనిపిస్తుంది
కోట్ల ప్రజాధనంతో కొత్తగా ముస్తాబవుతున్న
ఉగ్ర నరసింహుని ప్రపాకంలో
విలువలు మరిచిన అధికారం రాజకీయం బాసటగ
జరుగుతున్న మాఫీయా
వ్యాపారం కనిపిస్తుంది
ఆడపిల్లలను దాయడానికి బంకర్లూ తవ్విన
బరితెగించిన అభివృద్ధి కనిపిస్తుంది.