అందరం నేరస్తులమే
ఇప్పుడేవ్వరిని నిందిస్తే
పోయిన ప్రాణాలు తిరిగొస్తాయి
చేతులు కాలాక తీరిగ్గా
ఆకులు పట్టుకొన్న ఏలిన వారినా
మనిషి సంఘ జీవని మరచి
పుస్తకాలు పరీక్షలు ర్యాంకు లే
వారి ప్రపంచంగ మలచిన
తల్లిదండ్రులు గురువులనా
విద్యా ను పూర్తిగా కార్పోరేటీకరించి
ఒంటరితన్ని పెంచే జైళ్లు గా
విద్యాలయాలను మార్చిన సరళీకరణ నా
విద్య ను ఉచితంగా అందించకున్న సరే
పిల్లల నుంచి ఫీజులు వసూలు చేసిన
పరీక్షల మూల్యాంకనం కూడ
ప్రైవేటు చేతుల్లో పెట్టే ప్రభుత్వం వాజత్వాన్నా
పిల్లల భవిష్యత్తు నిర్ణయించే సందర్భంలో
అంకిత భావంతో కష్టించని పశ్చాతాపం వదిలి
ఇది ఏటా జరిగే రివాజే అంటూ
సిగ్గు విడిచి మాట్లాడే బ్యూరోక్రసి నా
నేను బాగా రాసాను ఎలా తప్పాను
సమాధానం కావాలని గొంతెత్తుతే
భరోసా కల్పించ వలిసిన క్షణం లో
భయోత్పాతం సృష్టించిన ఖాకీ రాజభక్తినా
ఎవ్వరిని నిందిస్తే
పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయి
తిల పాపం తలా పిడికెడు
లెక్కలు తీస్తూ పోతే నువ్వు నేను
అందరం కారణభూతులమే
విద్యా పరిపూర్ణ ఙ్ఞానం అందించే
ధశ నుంచి పరీక్షలే పరమావధి గా
ప్రైవేటు జేబుల్లోకి జారుతుంటే
ముప్పది ఏళ్లుగా ఎదురొడ్డి పోరాడలేక
సాక్షి భూతంగా నిలిచిన మనల్ని మనం
సమాధాన పరుచుకో గలిగితే
ఎవ్వరినైనా నిందించ వచ్చు